Janasena Chief Pawan Kalyan shed tears: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే కత్తిపూడి సభ, పిఠాపురంలో బహిరంగ సభలు నిర్వహించారు. నేటి ఉదయం 10 గంటలకు కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనవాణిలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కంటితడి పెట్టారు. జనవాణిలో భాగంగా దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తనకు వచ్చే పెన్షన్ ను నిలిపివేసిందని, ఆయన పడుతున్న కష్టాలు చెబుతుంటే చలించిపోయిన జనసేనాని కంటతడి పెట్టారు. దివ్యాంగుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


రూ.75 నుంచి పెన్షన్ అందుకుంటున్నాను. కానీ 2021లో పెన్షన్ తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్, చిరంజీవి అంటే తనకు ఇష్టమని చెప్పిన దివ్యాంగుడు శ్రీనివాస్.. ఎక్కువ కరెంట్ బిల్లు అని సాకు చూపించి ఉద్దేశపూర్వకంగా పింఛన్ తొలగించారని దివ్యాంగుడు శ్రీనివాస్ ఆరోపించారు. పలావుతో తిండి తిను, చేపల కూర నీకు అవసరమా అని వైసీపీ నేతలు ఎగతాళి చేశారని జనవాణిలో భాగంగా పవన్ కు ఆవేదన చెప్పుకున్నారు శ్రీనివాస్. 35 కేజీల రేషన్ బియ్యం వచ్చేదని, అది కూడా బంద్ చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. మేం తినేది ఈ బియ్యం, అసలే మా అమ్మకు షుగర్ ఉంది, థైరాయిడ్ కూడా ఉందని తన కుమారుడు అడిగితే మళ్లీ బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారని దివ్యాంగుడి తల్లి కనకం కన్నీటి పర్యంతమయ్యారు.






వైసీపీ ప్రభుత్వం తొలగిస్తే.. పవన్ కళ్యాణ్ పింఛన్ ఇస్తున్నారు
రెండేళ్ల కిందట మాకు పింఛన్ తీసేసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటివరకూ మాకు ఎవరూ న్యాయం చేయలేదని వాపోయారు దివ్యాంగుడు శ్రీనివాస్ తల్లి కనకం. జనసేన పార్టీ బాధితులకు అండగా నిలిచిందని, పవన్ కళ్యాణ్ కు తమ బాధలు తెలిసి ఆదుకున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తన కుమారుడి పింఛన్ తొలగిస్తే, పవన్ కళ్యాణ్ తొలిసారి తన జేబులోంచి పింఛన్ రూ.3000 ఇచ్చారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గత మూడు నెలల నుంచి పవన్ కళ్యాణ్ తన కుమారుడికి ఒకటో తేదీనే పెన్షన్ పంపిస్తున్నారని తెలిపారు. ఒకవేళ తమకు పవన్ తమకు పింఛన్ పంపించకపోతే తమ కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.  


నువ్వు సీఎం కావాలయ్యా..!
తమలాంటి వాళ్ల సమస్యలు తీరాలంటే నువ్వు సీఎం కావాలయ్యా అంటూ దివ్యాంగుడి తల్లి పవన్ కళ్యాణ్ తో అన్నారు. వీల్ చైర్ కావాలని అడిగితే ఇచ్చారు. కానీ అది కొన్ని రోజులకు విరిగిపోయిందని, ఎందుకంటే అది పాత వీల్ చైర్ అని చెప్పి వాపోయారు. రూ.10 వేలు అప్పుచేసి అతికష్టమ్మీద కొత్త వీల్ చైర్ కొనుక్కున్నాం లేకపోతే బాబు ఎక్కడికి వెళ్లడానికి వీలు కాదని అతడి తల్లి చెప్పుకొచ్చారు. మీరు సీఎం కావాలన్నా అని దివ్యాంగుడు శ్రీనివాస్ చెప్పగా.. ఆ విషయం తరువాత, ముందు మీ సమస్యకు పరిష్కారం చూద్దామని చెప్పి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.