JanaSena Chief Pawan Kalyan Speech At Kakinada Meeting: కాకినాడలో జనవాణిలో భాగంగా శనివారం పిటీషన్లు తీసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి పై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రౌడీయిజం చేసే వాళ్లకు తానెప్పుడూ వ్యతిరేకినని.. తనను పాలించేవాళ్లు, సీఎంగానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడు అయి ఉండాలన్నారు. క్రిమినల్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాలను నిర్దేశిస్తారంటూ తాను అభ్యంతరం వ్యక్తం చేస్తానని స్పష్టం చేశారు. అంబేద్కర్ గురించి, గాంధీ, భగత్ సింగ్ గురించి చదువుకో అంటారు. కానీ పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి. సీఎం క్రిమినల్స్ కు అండగా ఉంటే ఏం చేయాలన్నారు. 


కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలు, అవినీతిని చూస్తూ ఉరుకునేది లేదన్నారు. ‘జనసేన వారాహి పోస్టర్లు అతికిస్తుంటే నెంబర్ల ప్లేట్ లేని బైకు మీద వచ్చిన దుండగులు వాళ్లను బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద 50 వరకు గూండాలు ఉన్నారు. మీ అందరూ పద్ధతి మార్చుకోవాలి. నాకు అవకాశం, అధికారం వచ్చిన తరువాత ఈ గూండాలని ప్రతి ఒక్కరిని వీధి విధి తన్ని తన్ని తీసుకెళ్తాను. ద్వారంపూడి నువ్వు ఆడబిడ్డల జోలికి వచ్చినా, మీ గూండాలు ఆడవాళ్లను బెదిరించినా.. మీ తాతను టీటీ నాయక్ తీసుకెళ్లినట్లే, ఎమ్మెల్యే ద్వారంపూడిని బేడీలు వేసి తీసుకెళ్తామన్నారు. మీ తాతకు టీటీ నాయక్ చేసినట్లు.. నీకు భీమ్లానాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తానంటూ ఎమ్మెల్యే ద్వారంపూడిని హెచ్చరించారు. ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని వ్యాఖ్యానించారు.


‘సినిమా నటుడు అయినందుకు నా పొలిటికల్ జర్నీ ఆలస్యమైంది. 2009 నుంచే పాలిటిక్స్ లో ఉండి ఉంటే వైసీపీ అధికారంలోకి రాకుండే చేసేవాడ్ని అన్నారు పవన్. ఆవేశంగా కాదు ఆలోచించి మాట్లాడుతున్నాను. నా మాటలకు బాధ్యత తీసుకుంటాను. రెండున్నర, మూడేళ్ల కింద హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బీజేపీ నేతలతో మాట్లాడేందుకు వెళ్తున్న సమయంలో.. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి.. తమకు సీట్లు ఎక్కువ వచ్చాయని అహంకారంతో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను ఏమైనా అనొచ్చు అని అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడారు’ అని పవన్ అన్నారు.


తొలిసారి అప్పుడు కోపం వచ్చింది.. 
‘వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వాళ్ల తాత టైమ్ నుంచే పెద్ద రౌడీలు అంట. వాళ్ల వద్ద తుపాకీలు, కత్తులు ఉంటాయని జనసేన నేతలు నాకు చెప్పారు. బియ్యం ఎగుమతి చేయడంతో పాటు గతంలో ఆ ఫ్యామిలీ దొంగ నోట్లు కూడా ముద్రించారని అప్పటి ఎస్పీ వాళ్లను బేడీలు వేసి నడిపించారని నాకు చెప్పారు. ఎవరైనా తిడితే నాకు కోపం రాదు. వాడు ఎందుకు తిట్టాడా అని ఆలోచిస్తాను. దీన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా.. రాళ్లదాడి చేయించాడు. అప్పటివరకూ కోపం రాని నాకు మా నేతలు, వీర మహిళలపై దాడి జరిగిందని తెలియగానే కోపం వచ్చింది. ఢిల్లీకి నేను రాగానే ఏం మాట్లాడకున్నా 144 సెక్షన్ పెట్టారు. ఆరోజు నేను నిజంగా నోరు విప్పితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదని’ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలపై, సీఎంపై కోపం లేదు. కానీ వాళ్లు చేసే క్రిమినల్ చర్యలతో వాళ్లు రాష్ట్రానికి సరైన వ్యక్తులు కాదని ఫిక్సయినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. గోదావరి జిల్లాలు బలం, నేను ఉన్న సామాజిక వర్గం ఉందని కొందరు నేతలు చెబితే తనకు అందరూ సమానమేనని చెప్పినట్లు గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సమయంలో గోదావరి ప్రజలు తనకు అండగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సరిగా లేకపోతే ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అవుతాయి. రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడలో ఎన్నో సమస్యలకు వైసీపీ నేతలు కారణం అని ఆరోపించారు. 



సీఎం జగన్ అండ చూసుకుని ఎమ్మెల్యే అక్రమాలు.. 
బాపట్ల నియోజకవర్గంలో రెడ్డిపల్లిలో వెంకటేశ్వరరెడ్డి అనే యువకుడు గౌడ కులానికి చెందిన ఓ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందిన వాళ్లైనా క్షమించకూడదన్నారు. తప్పు చేసిన వాడు మన కులస్తుడు అయితే వాడిని మనోడు అని చెప్పుకుంటామా. ఓ ఎంపీ భార్యను, కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా లాంటి నేర సామ్రాజ్యాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం అని చెబుతున్నారు. రైస్ ఎగుమతితోనే రూ.15,000 కోట్లు సంపాదిస్తున్నారని పవన్ ఆరోపించారు. సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు ఓ ట్రస్ట్ కింద అన్ని కులాలకు సేవలు చేస్తే వారి భూములు కూడా స్థానిక ఎమ్మెల్యే కొట్టేశారని ఆరోపించారు. సీఎం జగన్ అండ చూసుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి అడ్డగోలుగా అక్రమాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.