Jaganmohini Kesava Swamy Temple : ముందు భాగంలో కేశవ స్వామి (విష్ణుమూర్తి) రూపంలో వెనుక వైపు జగన్మోహిని రూపంలో దర్శనమిచ్చే అరుదైన అరుదైన ప్రత్యేకమైన దైవ స్వరూపం చూడాలంటే అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని రావులపాలెం మండలం ర్యాలీ వెళ్లాల్సిందే.. అత్యంత ప్రసిద్ధమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయం రావులపాలెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు.. ప్రధానంగా ఈ ఆలయానికి ఉద్యోగులు తరలివస్తుంటారు.. తమకు నచ్చిన, అనుకూలమైన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ట్రాన్స్‌ఫర్ చేయాలని ఇక్కడికి వచ్చి మొక్కుకుంటుంటారు.. దీంతో ఈ ఆలయానికి ప్రమోషన్ ఇచ్చే ఆవయం, బదలీ మొక్కులు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందింది
జగన్మోహిని రూపంలో శ్రీవిష్ణుమూర్తి.. జగన్మోహిని కేశవ స్వామి ఆలయం 11వ శతాబ్దంలో చోళ రాజుల కాలంతో ముడిపడి ఉందని, అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేదని చెబుతారు. స్థల పురాణం ప్రకారం, చోళ రాజైన విక్రమదేవుడు ఈ ప్రాంతంలో ఒక దైవ సంకేతం ద్వారా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహాన్ని కనుగొన్నాడని, ఒక చెక్క రథం ఈ ప్రాంతంలో లాగుతూ వెళ్తుండగా అది ఒక చోట ఆగిపోయిందని, అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు సాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం లభించిందని చెబుతారు. ఈ విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని విక్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఇక జగన్మోహిని అవతారం హిందూ పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. సముద్ర మథనం సమయంలో, అమృతం కోసం దేవాసురుల మధ్య జరిగిన యుద్ధంలో, విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అసురులను మోహింపజేశాడని పురాణ కథనం. ఆలయ విశిష్టత
సాంప్రదాయ దక్షిణ భారతీయ ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయ గర్భగుడిలో జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం ఉంటుంది. ఆలయ సముదాయంలో ఉమా కమండలేశ్వరుడు (శివుడు) గుడి కూడా ఉంది. ఒకే సాలిగ్రామ శిలలో చెక్కిన 5 అడుగుల ఎత్తైన విగ్రహం ముందు వైపు కేశవ స్వామి (విష్ణుమూర్తి) రూపంలో మరియు వెనుక వైపు జగన్మోహిని రూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత.. ఇటువంటి ద్విముఖ విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదని చెబుతారు. ఆలయంలో శివుడు "ఉమా కమండలేశ్వరుడు"గా ఆరాధింపబడుతుండగా స్థల పురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసినప్పుడు, తన కమండలంలో ఉమాదేవితో కూడిన శివుని ప్రతిష్ట చేశాడు కాబట్టి ఆలయంలో శివుడు, జగన్మోహిని ఇద్దరికీ నిత్య పూజలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.. ఆలయంలో ఒక పవిత్రమైన నీటి ఊట ఉండడం ఈ ఆలయ మరో విశిష్టతగా చెబుతారు. దీని మూలం ఎవరికీ తెలియదు. ఈ ఊట 365 రోజులూ నీరు సరఫరా చేస్తుంది, మరియు భక్తులు దీనిని దైవిక శక్తిగా భావిస్తారు. బదిలీల ఆలయంగా ప్రసిద్ధి.. సాధారణంగా ఉద్యోగులు తమకు నచ్చిన, అనుకూలమైన ప్రాంతంలో ఉద్యోగం చేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది.. ఆ కోరిక నెరవేర్చే దేవుడుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఉద్యోగులు పోటెత్తుతుంటారు. చాలా మంది ఇక్కడికి వచ్చిన తరువాత తాము కోరుకున్న చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యిందని మొక్కులు తీర్చుకుంటుంటారు.. అందుకే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలు అయ్యిందంటే చాలు ఈ ఆలయానికి ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలివస్తుంటారు..