Konaseema latest News: ఈనెల 31న అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌టించనున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక కోన‌సీమ ప్రాంతానికి ఇది రెండోసారి వస్తున్నారు.  ఈసారి ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని చెయ్యేరు గ్రామంలో జ‌ర‌గ‌నున్న బంగారు కుటుంబం (పీ4) కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్ మ‌హేష్‌కుమార్ సార‌థ్యంలో  అధికారులు శ‌ర‌వేగంగా నిర్వ‌హిస్తున్నారు. 

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం...

ఈనెల 31వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు వారు ముమ్మిడివరం కాట్రేనికోన మండలాల‌లో పర్యటించనున్న నేప‌థ్యంలో  జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు త‌దిత‌ర అధికారులు ముంద‌స్తు ఏర్పాట్ల‌పై ప‌లు శాఖ‌ల అధికారుల‌తో ఆప్రాంతాన్ని ప‌రిశీలించి ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేసేదిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31న ముఖ్యమంత్రివర్యులు చెయ్యేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రూ 9. 88 లక్షలతో చేపట్టిన చెరువు పూడికతీత పనులు పరిశీలించి స్థానికంగా  పింఛన్ లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తారని తెలిపారు.

ప్రజా వేదిక వద్ద ప్రభుత్వ, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన ( పి4) పథకం బంగారు కుటుంబం లబ్ధిదారులు, మార్గదర్శకులను ముఖ్యమంత్రి వర్యులు ఆప్యాయంగా మర్యాదపూర్వకంగా పలకరించి ముచ్చటిస్తూ కోనసీమ జిల్లాలో (పి4) పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలుత ముఖ్యమంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలుసుకుంటారని తదుపరి చెరువు పూడికతీత పనులు పరిశీలించి స్థానికంగానే పింఛన్లు లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తారు. తదుపరి ప్రజావేదిక చేరుకుని పి4 పథకాన్ని ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు.

 వేదిక వద్దే పార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతారన్నారు. ముఖ్య మంత్రి వర్యుల పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయని, సీఎంఓ కార్యాలయ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారని వీరి పర్యటన అనంతరం పర్యటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం ఫైనలైజ్  అవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి డిఆర్ఓ రాజకుమారి డ్వామా పథక సంచాలకులు ఎస్ మధుసూదన్ ఆర్డీవోలు పి శ్రీకర్ కే మాధవి డిఎల్డివో రాజేశ్వరరావు సీఎమ్ఓ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కోన‌సీమ‌కు రెండోసారి..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాకు ఇది రెండోసారి.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వ‌హించిన గ్రామ‌స‌భ‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా  కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో వాన‌ప‌ల్లి గ్రామస‌భ‌లో ఆయన పాల్గొన్నారు. తాజాగా ప్ర‌భుత్వం, దాత‌లు, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో రూప‌క‌ల్ప‌న చేసిన పీ4 ప‌థ‌క బంగారు కుటుంబం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొన‌నున్నారు..