Accidents In Godavari River : గలగలా పారే గోదావరి నదీపాయలు కోనసీమ ప్రాంతానికి ప్రకృతి రమణీయతతోపాటు వనరులను అందిస్తున్నాయి.. ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక్క అఖండ గోదావరి కోనసీమ ప్రాంతంలోనే గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయాలుగా ప్రవహిస్తూ సాగరంలో కలుస్తున్నాయి.. అందుకే ముఖ్యంగా కోనసీమ ప్రజలకు గోదావరితో వారి నిత్యకృత్యం మమేకమై ఉంటుంది. వ్యవసాయ, ఉద్యాన పంటల పరంగానే కాకుండా కాస్త సేద తీరేందుకుకైనా.. ఆటవిడుపుకైనా.. చివరకు ఊరుదాటాలన్నా కూడా గోదావరి చెంతకు చేరాల్సిందే.. ఈ క్రమంలోనే అదే జీవనంతో ముడిపడి ఉన్న గోదావరి పాయల్లో మృత్యుపాశం ఎదరవుతోంది.
కొంత మేరకు అవగాహనా రాహిత్యం.. మరికొంత మానవతప్పిదం.. వెరసి మొత్తం మీద గోదావరి తీరం మృత్యుఘోషతో కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎందరో తల్లులకు కడుపుకోత మిగుల్చుతోంది. ఇటీవలే గోదావరి పాయల్లో సరదాగా ఆటవిడుపుగా ఈత కోడదామని వెళ్లిన ఎనిమిది మంది యువకుడు గోదావరిలో మునిగి మృత్యువాత పడిన ఘటన తెలిసింది. ఈ మహా విషాదం మరువక ముందే పి.గన్నవరం మండల పరిధిలోని రామారాజులంక సమీపంలో వశిష్ట నదీపాయలోని ఇసుక తిన్నెల్లోకి సరదగా వెళ్లిన ముగ్గురు యువకులు గోదావరిలో గల్లంతై మృతిచెందారు.. రెండు నెలల క్రితం ఆత్రేయపురం సమీపంలో కూడా సరిగ్గా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.. అయితే ఈ మరణాల వెనుక కచ్చితంగా మానవతప్పిదాలే ఉన్నాయన్నది చాలా మంది ఆరోపణగా కనిపిస్తోంది.
ఇసుకాసురుల చర్యలతోనే ప్రమాదాలు..
గోదావరి నదీపాయల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు ఇసుక ర్యాంపుల నిర్వాహకులు. జేసీబీలు, పొక్లయిన్లతో ఇసుకను అత్యంత లోతుల్లో తవ్వి తరలిస్తున్న క్రమంలోనే గోదావరి నదీపాయల్లో భారీగా గుంతలు ఏర్పాడ్డాయని, ఈ క్రమంలోనే ఇటీవల కురిసి వర్షాలకు వర్షంనీటితోపాటు గోదావరి నీళ్లు వచ్చి చేరడంతో అవి అగాథాలుగా ఏర్పడ్డాయని పలువురు చెబుతున్నారు. ఇది తెలియని యువకులు పక్కనే ఇసుక తిన్నెలు వద్ద సరదాగా గడిపి స్నానం చేసేందుకు ఆ గుంతల్లో దిగిన వారు మృత్యుఒడిలోకి వెళ్లిపోతున్నారని, ఆ గోతులు అగాథాలు అని తెలియకనే ఇటీవల కాలంలో ఘోరాలు జరిగాయని అంటున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు ఉండగా ఈ ర్యాంపుల పరిధిలో 16 వరకు ఇసుక తవ్వకం కేంద్రాలున్నాయి. ఇక్కడ యంత్రాలతో ఇసుకను తవ్వి తీస్తున్నారు. దీంతో అక్కడ భారీ అగాథాలుగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే ఒక్క కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని గోదావరి పాయల్లో ఇటీవల చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు మృత్యువాతపడ్డారు. ఇక ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కూడా గౌతమీ నదీపాయలో ఇసుక తవ్వకాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదంలో కమినిలంక, శేరులంక వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో యువకులు ఈ తరహా గోతుల్లో దిగే మృత్యువాతపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక వశిష్టానదీ ప్రవహించే పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో ముగ్గురు యువకులు మృతిచెందిన దుర్గటన విషయంలోనూ గోదావరి నదీపాయల్లో జేసీబీల ద్వారా తీసిక అగాధాలే కారణమని చెబుతున్నారు.
ఇసుక మాఫియా తవ్వకాల వల్లే మృత్యువాత..
ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు వల్లే కమిని గ్రామంలో నదీ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు యువకులు మరణించారని దేనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిపిఎం కమిటీ డిమాండ్ చేసింది.. ముమ్మాటికి ఇసుక మాఫియా చేసిన అక్రమ ఇసుక తవ్వకాలు వల్లే జరిగిన ప్రమాదంగా భావిస్తున్నామని ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు జిల్లావ్యాప్తంగా మీడియాలోనూ స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా జిల్లా ఉన్నత అధికారుల యంత్రాంగం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని దానివల్లే ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలు బలితీసుకున్నారని అక్రమంగా యంత్రాలతో నదిని పూర్తిగా గుంతలతో ఇసుకను తవ్వేసి ఆ గుంతల్లో పడి ఎనిమిది మంది చనిపోయారని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడే కాకుండా పి.గన్నవరం మండలంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని, ఈ ఘటనకు కారణం ఇసుక అక్రమ తవ్వకాలే అన్నారు.
ప్రధానంగా కోనసీమ జిల్లావ్యాప్తంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఉందని ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు గాని హెచ్చరిక చేస్తూ బోర్డులు గాని నెలకొల్పపకపోవడం బాధాకరమన్నారు.