Andhra Pradesh Ration Distribution : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాల ద్వారా పంపిణీని ఆపేసిన కూటమి సర్కారు ఇకపై రేషన్ షాపుల ద్వారానే కోటాను పంపిణీ చేయనుంది. జూన్ నుంచి ఇకపై సరకులు షాపుల వద్దే పంచి పెట్టనున్నారని దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మొబైల్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఈపోస్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను తొలగించారు. ఇప్పుడు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చిన కూటమిప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో కలిసి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని మధురానగర్ రేషన్ డిపోను సందర్శించారు. పంపిణీ విధానం తెలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్ సక్రమంగా పనిచేస్తుందో లేదో టెస్టు చేశారు.
ఈపోస్ లాగిన్ నుంచి సరకుల పంపిణీ వరకు జరిగే ప్రక్రియను పరిశీలించారు నాదెండ్ల మనోహర్. కార్డు నెంబర్ ఎంట్రీ, వేలిముద్రలు, కంటిపాల ద్వారా సరకుల అందజేత అన్నింటినీ చూశారు. ప్రజల సౌకర్యం అంటూ తీసుకొచ్చి వాహనాల ద్వారా ఎక్కువ పక్కదారి పట్టిందని మంత్రి తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా లేకపోగా ప్రభుత్వంపై అధికంగా భారం కూడా పడుతుందని అన్నారు. అసలు ఆ వాహనాలు ఎప్పుడు వచ్చి సరకులు ఇస్తాయో కూడా తెలిసేది కాదన్నారు. అన్నింటిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
ఇప్పటి వరకు వాహనం కోసం రోడ్లపై పడిగాపులు కాసేవాళ్లని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు మంత్రి నాదెండ్ల. రేషన్ షాపు వద్దకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చని అన్నారు. 15వ తేదీ వరకు ఏరోజైనా వెళ్లొచ్చని అన్నారు. 65 ఏళ్లు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగుల, భార్యభర్తలు ఇద్దరూ వృద్ధులైతే వారి ఇంటికే సరకులు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. వేరే ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పోర్టబిలిడీ విధానంలో రేషన్ సరకులు పొందొచ్చని మంత్రి పేర్కొన్నారు. రేషన్ సరకుల పంపిణీలో చాలా అక్రమాలు జరిగాయని వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని అన్నారు. ఈ యాప్ ద్వార కార్డుదారులతోపాటు డీలర్ వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రస్తుతం యాప్ ద్వారా రేషన్ దుకాణం వద్ద ఎంత మంది జనం ఉన్నారో కూడా తెలిసిపోతుందని తెలిపారు.
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఇంటి వద్దకే రేషన్ కోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంపై సమీక్ష చేపట్టింది. రద్దు చేయాలని నిర్ణయించింది. వాహనాల ద్వారా ఇంటికే సరకులు పంపిణీ చేయడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పిందని అధికారులు అభిప్రాయపడ్డారు. వాహనాలు వచ్చినప్పుడు లబ్ధిదారులు ఇంట్లో లేకపోవడం, మరోసారి వాహనం రాకపోవడంతో రేషన్ కోల్పోతున్నారు. ఇది కొందరికి అసౌకర్యంగా మారింది. దీనికి తోడు నిర్వహణ ఖర్చు కూడా చాలా అవుతుందని, ఖర్చు అయినా అసలు లక్ష్యం నెరవేరడం లేదన్నది ప్రభుత్వ వాదన. అందుకే పాత పద్ధతిలోనే రేషన్ షాపుల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయించారు.