Anakapalli Rape Case: అనకాపల్లి జిల్లాలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లు బహిరంగ విసర్జనకు వెళ్లగా, నిందితుడు ఓ బాలికను లాక్కెళ్లినట్లు సమాచారం. మరో బాలిక ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, వారు వెతికేసరికే ఘోరం జరిగిపోయింది. రక్త స్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు.


ఫోన్‌లో మాట్లాడిన హోం మంత్రి Taneti Vanitha
అనకాపల్లి (Anakapalli Rape Case) చిన్నారి ఘటన, శ్రీ సత్యసాయి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థిని మరణ ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత (Taneti Vanitha) ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అనకాపల్లి ఘటన (Anakapalli Rape Incident) నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరు బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నట్లు హోంమంత్రికి అనకాపల్లి (Anakapalli) ఎస్పీ తెలిపారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి తానేటి వనిత (Taneti Vanitha) వైద్య అధికారులకు సూచించారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు.


శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Satyasai District) జరిగిన తేజస్విని మరణ ఘటనలో నిందితుడు సాదిక్ ను కూడా వెంటనే అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మంత్రికి తెలిపారు. తేజస్విని తల్లిదండ్రులు కోరినట్లుగానే రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హోంమంత్రికి తెలిపారు. చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తానేటి వనిత హెచ్చరించారు.


సమగ్ర విచారణకు రామకృష్ణ డిమాండ్
బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని (Tejaswini) మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. తన కుమార్తె మరణంపై తేజస్విని తల్లి అనుమానం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చు మీరుతున్నాయని అన్నారు. పాలన చేతకాక, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కంట్రోల్ చేయలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రతిపక్షాలపై అపవాదులు వేయటం తగదని మండిపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి మహిళ అయిఉండి కూడా, ఈ ఘటనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తగదని విమర్శించారు. ఒకపక్క మద్యం మత్తులో ఘోరాలు జరుగుతున్నాయని మంత్రులు చెబుతున్నారని, మరోవైపు, రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.