వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం సాయంత్రం నుంచి మాత్రం కొన్ని ప్రాంతాల్లో వరుణుడు చిన్న బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇంకా వర్షాల బెడద పోలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
గడచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఈ వర్షాల వలన కురిసిన నీరు నేరుగా గోదావరి నదిలోకి చేరుతోంది. ఫలితంగా భద్రాచలం, పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇంకా గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతున్న వేళ ఉభయ గోదావరి జిల్లాలు మరింత అప్రమతంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చబోతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ప్రాజెక్ట్‌లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా నదిలోకి కూడా వదర నీరు చేరుతోంది. ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల్లోకి వస్తున్న ఇన్‌ఫ్లో పరిశీలిస్తే... శ్రీశైలంలో ప్రస్తుతానికి 25865 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆల్మటీ నుంచి మాత్రం 85857 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అందుకే మరికొన్ని గంటల్లో కృష్ణా నది మీదుగా వరద ప్రభావం పెరిగే ఛాన్స్ ఉండనే ఉంది.
వరంగల్ డివిజన్‌లో మూడు రోజులు కురిసిన వర్షపు నీరంతా నేరుగా గోదావరిలోకి చేరుతోంది. పూర్తిగా నిండిపోయిన కాడెం ప్రాజెక్టులోని నీరు దిగువకు వదులుతున్నారు. శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్ట్‌లో కూడా 1,23,457 క్యూసెక్‌ల నీరు నీరు దిగువకు విడిచిపెడుతున్నారు. వీటన్నింటి ఫలితంగా గోదావరిలో వరద ఉద్ధృతి మరికొన్ని గంటల్లో, రోజుల్లో పెరిగే అవకాశం ఉంది.
అఖండ గోదావరికి భారీ స్థాయిలో వదర ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం నుంచి 13 లక్షలకు పైబడి వరద నీటిని సముద్రంలోకి వదులుతుండడంతో దిగువనున్న గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో మరింత వరద నీరు దిగువకు వదిలే అవకాశాలున్నందున నదీపరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నాలుగు నదీపాయలు అన్నీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోనే ప్రవహించి తద్వారా సముద్రంలో కలిస్తుండడంతో కోనసీమ జిల్లాపరిధిలో లంక గ్రామాల్లో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
కోనసీమ జిల్లాలో అప్రమత్తం..
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు భారీ స్థాయిలో సముద్రంలోకి వదులుతుండడంతో నదీపాయల్లో వరద ఉద్దృతి బాగా పెరుగుతోంది. వరద ఉద్ధృతి బాగా పెరగడంతో పలు లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అతున్నాయి.. ప్రధానంగా కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని పలు లంక గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కనకాయిలంక, అయినవిల్లిలంక కాజ్‌వేలు ముంపుకు గురయ్యాయి. పి.గన్నవరం అక్విడక్ట్ వద్ద వరద ఉరకలెత్తుతోంది.. రాజోలు వద్ద వశిష్ట నదీ ఎడమ గట్టు బలహీనంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతుండడంతో పశువులకు దాణా దొరకక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిరది. ఏటిగట్లుపై ఇప్పటికే పశువులను కట్టివేస్తున్నారు.
రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర వర్షాలు
ఎప్పుడైనా రుతుపవనాల కాలంలో పశ్చిమ బంగాల్ మీదుగా అల్పపీడనం ఏర్పడితే మొదటి రోజు విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. అదే రెండో రోజు, మూడో రోజు రోజంతా చినుకులు ఉంటాయి.
ఈ ఆదివారం అంటే జులై 30న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని వలన ఉత్తరాంధ్రలో వర్షాలను జూలై 30, 31, ఆగస్టు1 న చూడొచ్చు.