BR Ambedkar Konaseema District | ఉప్పలగుప్తం: గత కొన్ని నెలలుగా కడుపునొప్పి వస్తోందని కూతురు చెబుతుంటే ఊళ్లో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌కు చూపించారు. ఆయన ఏదో మాత్ర రాసిచ్చాడు. ఆతరువాత తరచూ వాంతులు కూడా అవుతున్నాయి, కానీ కడుపు నొప్పి మాత్రం తగ్గడం లేదు. ఇలా ఇబ్బంది పడుతున్న కుమార్తెను పెద్దాసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. స్కానింగ్‌ (Endoscopy)  చేయించగా, రిపోర్టులు చూసిన తరువాత షాక్‌ అవ్వడం డాక్టర్ల వంతయ్యింది. కడుపులో పెద్ద వెంట్రుకల చుట్ట ఉండడం చూసి నివ్వరపోయారు. అసలు కడుపులోకి అంతపెద్ద వెంట్రుకల చుట్ట ఎలా వచ్చింది.. ఇన్నాళ్లు ఎలా భరించిందని ఆ బాలికనే ఆరా తీస్తే బాలిక చెప్పిన సమాధానం విని డాక్టర్లు ఆశ్చర్యపోయారు.


అసలేం జరిగిందంటే..


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Konaseema District)లోని ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలిక కడుపునొప్పితో గత మూడు రోజులగా బాధపడుతోంది. వాంతులు కూడా అవుతున్నాయి.. కూతురు పడుతున్న ఇబ్బందులు చూడలేక చివరకు అమలాపురంలోని సాయి విశ్వాస్‌ ఆసుపత్రికి బాధపడుతున్న కూతురును ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లితండ్రులు. సాధరణ పరీక్షలు చేసిన వైద్యుడు గంధం విశ్వనాధ్‌ తొలుత ఏదో చిన్న సమస్య అయ్యి ఉటుందని భావించారు. అయితే వాంతులు అవ్వడం, తీవ్రంగా కడుపునొప్పి రావడంతో పాటు కడుపులో నొప్పిగా ఉండడం ఇలా పలు లక్షణాలను గమనించిన డాక్టర్‌ విశ్వనాధ్‌ స్కానింగ్‌ చేయించారు. దీంతో అసలు విషయం బయట పడింది. 


కడుపులో కేజీన్నర వెంట్రుకల చుట్ట...


తీవ్రమైన కడుపునొప్పి, వాంతులుతో బాధపడుతున్న బాలికకు స్కానింగ్‌ (ఎండోస్కోపీ) చేయించడంతో కడుపులో కేజీన్నర వెంట్రుకల చుట్ట ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అసలు కడుపులోకి ఈవెంట్రుకలు ఎలా వెళ్లాయి అని ఆరా తీస్తే మొదట బాలిక నోరు విప్పకపోయినా బుజ్జగించి అడిగితే భయపడుతూ అసలు విషయం చెప్పింది.. కడుపులో కణతి మాదిరిగా మారిన వెంట్రుకల చుట్ట జీర్ణాశయాన్ని మొత్తం మూసేసినట్లు గుర్తించారు. 


తన వెంట్రుకలు తానే తింటున్న బాలిక...


తన తల వెంట్రుకలు ఆ బాలిక కొన్ని నెలలుగా తింటుందని బాలికే స్వయంగా చెప్పడంతో షాక్‌కు గురయ్యారు వైద్యులు. తల వెంట్రుకలు లాక్కుని కొన్ని, వాటికవే ఊడిపోతున్న వెంట్రుకలను ఇలా కలగలపి రోజూ తింటున్నానని బాలిక వైద్యులకు చెప్పుకొచ్చింది. పైగా వాటిని నమిలి మింగుతున్నానని తెలిపింది.


శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు


బాలిక కడుపులో దాదాపు కేజీన్నర వెంట్రుకల చుట్ట ఉన్నట్లు స్కానింగ్‌ పరీక్షల ద్వారా గుర్తించిన వైద్యులు ఆపరేషన్‌ చేసి తొలగించారు. బాలిక తన జుట్టును తినే వింత అలవాటు ఉండడం వల్లనే రహస్యంగా ఈ పనిచేస్తోందని ఇది ఒక మానసిక వ్యాధి అన్నారు. ట్రైకోటిల్లోమానియా (హెయిర్‌ పుల్లింగ్‌ డిజార్డర్‌) అనే అరుదైన వ్యాధి వంటిదన్నారు. చాలా మంది మహిళల్లో కనిపిస్తుందని, తమ జుట్టు తామేపీక్కుని తినే అలవాటు ఉంటుందన్నారు. తల్లితండ్రులు పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉందని, ఆసుపత్రిలో కోలుకొంటోందని తెలిపారు. 


Also Read: Byreddy sabari On Jagan: జగన్‌కు ప్రజలు కుర్చీ మడత పెట్టారు - వైరల్ అవుతున్న బైరెడ్డి శబరి పార్లమెంట్ ప్రసంగం