కోనసీమ: దొంగనోట్లను ఏకంగా క్యాష్‌ డిపాజిట్‌ మిషన్‌లో జమ చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో అనుమానమొచ్చిన బ్యాంకు మేనేజర్‌ పోలీసులకు సమాచారం అందివ్వడంతో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు అయ్యింది. ఈ అక్రమ వ్యవహారంలో 12 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ముఠా కార్యకలాపాలను మరింత డొంక కదలించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు, సీఐ నరేష్‌కుమార్‌లతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్ల‌డించారు.


బ్యాంకులోనే డిపాజిట్‌ చేయాలనుకున్నాడు.. కానీ


ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 వేల రూపాయల దొంగ నోట్లను బ్యాంకు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్‌లో డిపాజిట్‌ చేసి తద్వారా డిజిటల్‌ కరెన్సీగా మార్చాలనుకున్నాడు రాజోలు మండలం తాటిపాక ప్రాంతానికి చెందిన పాస్టర్‌ వీరవెంకట సత్యనారాయణ. నవంబర్‌ 30న రాజోలులోని ఓ బ్యాంకు వద్ద ఉన్న క్యాష్‌ డిపాజిట్‌ మిషన్‌లో తాటిపాకకు చెందిన పాస్టర్‌ కొల్లా వీరవెంకట సత్యనారాయణ రూ.50 వేలు నగదును డిపాజిట్‌ చేసే ప్రయత్నం చేశాడు. అవి నకిలీవి కావడంతో వాటిని రిజెక్ట్‌ చేసింది.. పలుసార్లు డిపాజిట్‌ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనుమానమొచ్చిన రాజోలు యాక్సెస్‌ బ్యాంకు  మేనేజర్‌ పోలీసులకు సమాచారం అందించారు. రాజోలు సీఐ నరేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై బి.రాజేష్‌కుమార్‌ లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. 


తీగ లాగితే డొంక బటయపడిందిలా..


పాస్టర్‌ దొంగనోట్లను క్యాష్‌ డిపాజిట్‌ మిషన్‌లో జమ చేసే ప్రయత్నం వెనుక ఎవరున్నారన్న విషయంలో పోలీసులు కూపీ లాగారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వీర రాఘవ రెడ్డి, పాస్టర్‌ సత్యనారాయణ కలిసి దొంగనోట్ల గురించి పలుసార్లు సంభాషించుకున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా కడియం మండలం వేమగిరికి చెందిన తుంపర దుర్గాప్రసాద్‌, ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన పాశర్లపూడి వెంకటసత్యనారాయణ, రాయవరం మండలం వెంటూరుకు చెందిన పట్టపగలు మారయ్య, రామచంద్రపురంకు చెందిన ఉత్తరాల హరిఅ ప్పారావు, మాగంటి గోపి, కృష్ణాజిల్లా గన్నవరంకు చెందిన షేక్‌ మస్తాన్‌, ఇదే జిల్లా వీరపల్లికి చెందిన షేక్‌ హనీఫ్‌, కపిలేశ్వరపురం మండలం రామాపురానికి చెందిన బక్కా శ్రీనివాస్‌, తాళ్లరేవు మండలంలోని బడ్డు వెంకటయ్యపాలెంకు చెందిన మేదా పోసారావు, కాకినాడ జిల్లా పెదపూడికి చెందిన చింతా వీరన్నలకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 


బలమైన నెట్‌వర్క్‌ ద్వారా మారకాలు..


దొంగనోట్లను మార్చడమే పనిగా పెట్టుకున్న ఈ ముఠా అంతా కృష్ణాజిల్లా హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని వీరపల్లి ప్రాంతంలోని షేక్‌ మస్తాన్‌ ఏఎంఎస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ నడుపుతుండగా ఈ ముఠాలోని ఓ బలమైన నెట్‌వర్క్‌ ద్వారా దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఈ ముఠానుంచి రూ.1.33 లక్షల నకిలీ కరెన్సీతోపాటు ఆ నోట్ల తయారీకు ఉపయోగించే 12 రకాల యంత్రాలను, పరికరాలను, ప్రింటర్లను స్వాదీనంచేసుకున్నట్లు తెలిపారు. ఇదే ముఠా కృష్ణా జిల్లాతోపాటు పలు జిల్లాలో దొంగనోట్ల మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు వెల్ల‌డించారు.


పోలీసులకు రివార్డులు..


దొంగనోట్ల ముఠా కేసులో కీలక నిందితులను గుర్తించి దర్యాప్తులో శ్రమించిన రాజోలు ఎస్సై బి.రాజేష్‌కుమార్‌ను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందించారు. రాజోలు సీఐ నరేష్‌ కుమార్‌, క్రైమ్‌ సీఐ ప్రశాంత్‌కుమార్‌లను అభినందించారు.  క్రైమ్‌ పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ కె.వెంకటరమణ, ఎం.రమేష్‌, కానిస్టేబుళ్లు హుస్సేన్‌, నవీన్‌, ఆలీ, పూజలకు కూడా ఎస్పీ రివార్డులు అందజేశారు. 


Also Read: AP Elections: జమిలి అమల్లోకి వచ్చినా, 2029లోనే ఏపీలో ఎన్నికలు - ఏపీ సీఎం చంద్రబాబు