AP Deputy CM Pawan Kalyan | రాజోలు నియోజకవర్గంలోని కేసనపల్లి గ్రామంలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ పొంగి కొబ్బరి పంట నాశనమైన క్రమంలో దీనికి శాస్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలో భాగంగా బుధవారం రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గత నెలలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కాగా మొంథ్ తుపాను వల్ల అది కాస్త వాయిదా పడింది.. అయితే ఈసారి కేశనపల్లితోపాటు శంకరగుప్తం మేజర్ డ్రైన్‌కు ఆనుకుని ఉన్న దాదాపు 5000 ఎకరాల్లోని ఉప్పనీటి ముంపు సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టడం నుంచి ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.. దీంతో పాటు రాజోలు నియోజకవర్గంలోనే శివకోటి గ్రామంలో నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే..
ఈనెల 26వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపము ఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన దాదాపు ఖరారు అయ్యింది. దీంతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సారధ్యంలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటలకు సంబందించి ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. శనివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ నిశాంతి, డీఆర్వో కె.మాధవి తదితర అధికారురులు రాజోలులోని కాపు కళ్యాణ మండపంకు సమీపంలో ఉన్న లే అవుట్‌లో హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పర్యటించే శంకరగుప్తం మేజర్ డ్రైన్, కేశనపల్లిలోని కొబ్బరితోటలు తదితర ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ప్రత్యేక హెలికాప్టర్లో శివకోడు హెలిప్యాడ్ కు
పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబందించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా వివరాలిలా ఉన్నాయి.. 26వ తేదీ రాజమండ్రి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో శివకోడు హెలిప్యాడ్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి కేసనపల్లి శంకర్ గుప్తం డ్రయిన్ ఆనుకుని ఉన్న 12 గ్రామాల పర్యటించి దారి పొడవునా కొబ్బరి చెట్లు చనిపోయిన బాధిత రైతులతో ముఖా ముఖి ఉంటుంది.. తదుపరి శివకోడు చేరుకుని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కాపు కళ్యాణ మండపం వద్ద పల్లె పండుగ 2.0 రాష్ట్రస్థాయి మీటింగ్ కు హాజరు కానున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ములికిపల్లి కాట్రేనిపాడులంక మధ్య 4.5 కిలోమీటర్లు రోడ్డు 3.21 కోట్లతో శంకుస్థాపన చేస్తారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ నిధులైన 5 కోట్లతో గుడిమేల్లంక మంచినీటి పథకం రాపిడ్ సాండ్ఫిల్టర్ శంకుస్థాపన చేస్తారు. ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులు కింద 7:50 కోట్లతో రాజోలు నియోజకవర్గం లో ఓహెచ్ఎస్ఆర్లు శంకుస్థాపన చేయనున్నారు. రాజోలు సామాజిక ఆరోగ్య కేంద్రం కు ఎక్విప్మెంట్లు పంపిణీ చేసి మరియు నరేగా అనుసంధానంతో రూ.11.451 కోట్లతో 177 రోడ్లకు శంకుస్థాపన శిలాఫలకాల ఆవిష్కరిస్తారు. ఈ మొత్తం పర్యటన సమయం రాజోలు నియోజకవర్గంలో సుమారు రెండున్నర గంటలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి చెట్ల సమస్య ఇదే..
రాజోలు నియోజకవర్గంలోని కేసనపల్లి (కేశనపల్లి) గ్రామంలో కొబ్బరి చెట్లు చనిపోవడానికి ప్రధాన కారణం సముద్రం బ్యాక్ వాటర్ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా డ్రైనుకు ఆనుకుని ఉన్న కొబ్బరితోటల్లోకి పోటెత్తడంతో కోబ్బరి చెట్లు చనిపోతున్నాయి.. శంకరగుప్తం డ్రైన్ నిజానికి ఫ్రెష్‌వాటర్ డ్రైన్ (22.7 కి.మీ. పొడవు)లో ఉండగా ఈ డ్రైనుకు 2013, 2017లో డ్రెజ్జింగ్ ద్వారా తవ్వకాలు చేశారు. అయితే మధ్యలో 7.9 కి.మీ. భాగం తవ్వకపోవడంతో వైనతేయ నదీపాయనుంచి పోటెత్తుతోన్న సముద్రం బ్యాక్ వాటర్ డ్రైన్ ద్వారా పొంగి కిందకు దిగకపోగా డ్రైన్‌ను ఆనకుని ఉన్న వేలాది ఎకరాల కొబ్బరితోటల్లోకి పోటెత్తుతోంది.. దీంతో ఉప్పునీటి బ్యాక్‌ఫ్లో వచ్చి సారవంతమైన భూములన్నీ ఉప్పజలాలతో ఊటెత్తుతున్నాయి.. ఫలితంగా, 2019 నుంచి చెట్లు ఆకస్మికంగా చనిపోతున్నాయి. కేసనపల్లిలో 500 ఎకరాల్లో 5,000 చెట్లు చనిపోయాయి. 150 మంది రైతులు ప్రభావితమయ్యారు. మొత్తంగా కోనసీమలో 9 గ్రామాల్లో 1 లక్ష చెట్లు (2019-2025 మధ్య) చనిపోయాయి.
ఇటీవలే పలు హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్..
జనసేన పార్టీకు రెండు సార్లు విజయాన్ని కట్టబెట్టిన రాజోలు నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే పలు హామీలు ఇచ్చారు. దసరా తర్వాత (అక్టోబర్ 2025లో) కేసనపల్లి సహా 13 గ్రామాల్లో (కరవక, గొల్లపాలెం, గోగన్నమటం, శంకరగుప్తం మొదలైనవి) ప్రభావిత పొలాలను స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, కొబ్బరి పరిశోధన స్టేషన్ శాస్త్రవేత్తలతో కలిసి రైతులతో సమావేశమై, నష్టాలను స్థానికంగా అంచనా వేసి, త్వరగా సహాయం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినా కూటమి ప్రభుత్వంలో శాస్వత పరిష్కారం చూపుతామని పవన్ కళ్యాన్ నిర్ధిష్టమైన హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగా ఈ సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.