Rains In Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ఆ తర్వాత 36 గంటల్లో ఈ వాయుగుండం మరింత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలం పుంజుకునే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.

Continues below advertisement

ఈ 28 నుంచి డిసెంబర్ 1 వర్షాలు..

ఈ వాయుగుండం ప్రభావం కారణంగా నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 01వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ అంచనా వేసింది. రైతులకు కొన్ని ముఖ్యమైన సూచనలను జారీ చేసింది. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్నందున, రైతులు వెంటనే కోసిన ధాన్యాన్ని కుప్పలు వేసుకోవాలని కోరారు. పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని, ధాన్యం రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని సూచించారు. వర్షం కారణంగా తడిసిన గింజలు మొలకెత్తకుండా మరియు నాణ్యత కోల్పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ రైతులకు విజ్ఞప్తి చేసింది.

Continues below advertisement

ఆదివారం (నవంబర్ 23, 2025) నాడు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. విపత్తుల సంస్థ ప్రకారం.. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ సూచించింది.