తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో గోదావరి లంక ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. కొన్నిచోట్ల అటవీ ప్రాంతాల్లోకి కూడా నీరు రావడంతో వన్యప్రాణులు ఊళ్లోకి వస్తున్నాయి. ఎక్కడ మెరక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో గుంపులుగా సంచరిస్తున్న పరిస్థితి రావులపాలెం లంక ప్రాంతాల్లో కనిపిస్తోంది. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండల పరిధిలోకి వచ్చే లంక ప్రాంతాల్లో జింకలు గుంపులుగా సంచరిస్తూ ఉండడం పలువురు కంటపడ్డాయి. తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు.


ఇటు తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధ గౌతమి నదీ ఉవ్వెత్తున పొంగి ప్రవహిస్తుండటంతో పుదుచ్చేరి యానం నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యానం దగ్గర గట్టు తెగింది. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. 






చేతిపంపు నుంచి ఏకధాటిగా నీరు
వరదల కారణంగా కోనసీమ జిల్లాలో ఈ వింత చోటు చేసుకుంది. ఓ చేతి పంపు నుండి నీరు ఏకధాటిగా వస్తుండడాన్ని స్థానికులు గమనించారు. పి.గన్నవరం మండలం బెల్లంపూడిలో ఒక ఇంటి దగ్గర ఉన్న బోరు బావి చేతి పంపు నుండి నీరు దానికదే ఏకధాటిగా వచ్చింది. ఎవరు కొట్టకుండానే నీరు రావటంతో స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. చుట్టూ వరద నీరు నిండిపోవడంతో ఇలా వస్తుందని స్థానికులు అనుకున్నారు. దీన్ని కొంత మంది వీడియోలు తీశారు.


10 కిలో మీటర్ల మేర వరద నీరు
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో ప్రధాన రహదాలు మునిగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనసీమలో లంకలను దాటి ప్రధాన రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. పి.గన్నవరం లోని నాగుల్లంక వద్ద రోడ్లపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. 10 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై వరద నీరు పారుతుండగా, రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం నుండి రాజోలు వెళ్ళే ప్రధాన రహదారిపై ఈ ఘటన కనిపించింది. 


స్థానికుల ఆగ్రహం
మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో ఏటి గట్టుపైకి వరద నీరు చొచ్చుకొస్తుంది. దీంతో గ్రామస్థులు స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి గండీ పడితే మూడు మండలాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో పెదపట్నం లంక బాబా నగర్ గ్రామస్తులు ఉన్నారు.