గోదావరి నది కి పోటెత్తిన వరదల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరిగిన నీటి మట్టాన్ని తగ్గించడానికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సూచించారు. ధవళేశ్వరం నుండి 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత 12 గంటల నుంచి నీటిని సాధ్యమైనంత వరకు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.


ప్రజలు సహకరించాలన్న కలెక్టర్.. 
జూలై 16వ తేదీ శనివారం రాత్రి  8.00 గంటలకు 25.33 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేయగా..  రాత్రి 11కి  25.59 , అర్ధరాత్రి 12 వరకు 25.63 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. శనివారం అర్ధరాత్రి 1 గంటకి  25.63 లక్షల క్యూసెక్కులు,  2 గంటలకు 25.77 , ఉదయం 3 వరకు  25.80 , ఉదయం 4 వరకు  25.80, ఉదయం  5 గంటల వరకు 25.8 , ఉదయం 6 కు   25.80, ఉదయం 7 గంటలకు 25.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. గత 4 గంటలుగా బ్యారేజ్ నుంచి 25.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని స్థిరంగా విడుదల చేయడం జరుగుతోందని చెప్పారు. రాబోయే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


గోదావరి వరద ఉధృతి వల్ల ధవళేశ్వరం బ్యారేజి వద్ద  గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  25.29  లక్షల క్యూసెక్కులు ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల కారణంగా 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 645 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో మొత్తం  10 ఎన్డీఆర్ఎఫ్,  10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని.. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో  324 గ్రామాలు వరద ప్రభావితమైనవని ప్రకటనలో తెలిపారు.


మరో 191 గ్రామల్లో చేరిన వరదనీరు...
గోదావరికి వరద నీటితో ఇప్పటివరకు 76,775 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 67,601 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు 243 మెడికల్ క్యాంప్స్ నిర్వహణ,54,823 ఆహార ప్యాకేట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గే అవకాశం ఉందని, పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రజలను అప్రమత్తం చేశారు.
గోదావరి నదీపాయలో వ్యక్తి గల్లంతు
కోనసీమల జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన కడలి శ్రీనివాసరావు(50) గోదావరి నదీపాయిలో గల్లంతయ్యాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గల్లంతు అయినట్లు సమాచారం. పడవ దాటించే వద్ద అధికారులు ఎవరూ లేకపోవడంతో వరద ఉధృతిలోనే వెళ్లిపోయే ప్రయత్నం చేసిన శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ టీమ్‌తో కలిసి పడవుల పై గాలింపు చర్యలు చేపట్టారు.