Godavari Floods : గత ఐదు రోజులుగా భద్రాచలం పరిసర ప్రాంతాలను వణికించిన ఉగ్రగోదావరి కాస్తా శాంతించింది. ఎగువ నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శనివారం ఉదయం నుంచి వరద నీటి ప్రవాహం కాస్త తగ్గింది. అయితే వరద నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరికకు దిగువకు రాని క్రమంలో మరో రెండు రోజుల పాటు ముంపు బాధితులను పునరావాస కేంద్రాలలోనే ఉండాలని అధికారులు సూచనలు చేశారు. కాగా వరద తగ్గుముఖం పట్టినప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం, మంచి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద ప్రాంతాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ్ సై రేపు పర్యటించనున్నారు.
ముంపులో 200 గ్రామాలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి వరకు మరింత ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి కాస్త శాంతించింది. శుక్రవారం సాయంత్రం భద్రాచలం వద్ద 70.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం ఇవాళ 69.4 అడుగులకు తగ్గింది. వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు అంటున్నారు. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరిలో 24.29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని తెలిపారు. శనివారం సాయంత్రానికి 23.40 లక్షల క్యూసెక్కులకు తగ్గిందన్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నదీ తీర ప్రాంత గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఈ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ముంపు గ్రామాల్లో ప్రజల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి.
ధవళేశ్వరం వద్ద భారీ వరద
ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 20.60 అడుగులకు వరద నీరు చేరింది. బ్యారేజీ నుంచి పంట కాల్వలకు 10,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సముద్రంలోకి 23.94 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోన్న క్రమంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల నిర్వహణ సంస్థ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. బ్యారేజీకి మరో 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆరు జిల్లా్ల్లో 44 మండలాల్లోని 628 గ్రామాలపై వరద ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. రంగంలోని దిగిన 10 ఎన్డీఆర్‌ఎఫ్, 10 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు.
300 మూగజీవాలు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి మధ్య లంక గ్రామాల్లో సుమారు 300 ఆవులు చిక్కుకున్నాయి. దాతలు అందించిన గోవులను గోదావరి లంకల్లో షెడ్లు వేసి గోసంరక్షణ చేస్తున్నారు కొవ్వూరు గోసాలకు చెందిన రామకృష్ణప్రభు. గోదావరి వరద వస్తున్న ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఆవులు గోదావరిలో చిక్కుకున్నాయి. చెల్లా చెదురైన ఆవులు గోదావరి గోంగూలంక వెళ్తున్నాయి. ఆవుల్ని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
లంకలో చిక్కుకున్న రైతులు
కొవ్వూరు మండలం ఔరంగాబాద్ సమీపంలోని గోంగూర తిప్ప లంకలో 13 మంది రైతులు చిక్కుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పశువులను తరలించేందుకు రైతులు పడవపై వెళ్లారు. గోదావరి ఉద్ధృతికి డీజిల్ అయిపోవడంతో రాత్రి నుంచి లంకలోనే రైతులు ఉండిపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 13 మంది రైతులను ఇవాళ స్థానిక సీఐ, ఫైర్ డిపార్ట్మెంట్ బృందం రక్షించారు.