Godavari Floods | రాజమండ్రి: మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగి దిగువకు ఉరకలెత్తి ప్రవహిస్తోంది.. దీంతో భద్రాచలం వద్ద భారీగా పెరిగిన వరద అదే స్థాయిలో అఖండ గోదావరిలో ఉరకలెత్తతోంది.. ఈ ప్రభావంతో ధవళేశ్వరం (Dowaleshwaram Barrage) వద్ద 12.70 అడుగుల స్థాయికి వరద చేరింది. దీంతో ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు.. బ్యారేజ్ అన్నిగేట్లు ఎత్తి దిగువకు సముద్రంలోకి 11.24 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు జలవనరుల శాఖ అధికారులు.. నెల రోజుల వ్యవధిలో మూడోసారి... గోదావరికి నెల రోజుల వ్యవధిలో మూడోసారి వరద పోటెత్తిన పరిస్థితి తలెత్తింది.. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో మూడు దఫాలుగా వరదలు పోటెత్తాయి.. దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో దిగువకు 3 కోట్ల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వృధా పోయినట్లు అంచనా ఉంది.. తాజాగా వరదలు పోటెత్తుతుండడంతో రోజుకు 10 లక్షల క్యూసెక్కులకు మించి వరద నీరు సముద్రంలోకి వదులుతున్నారు.. లంక గ్రామాల ప్రజలకు తప్పని అవస్థలు.. గోదావరికి వరదలు పోటెత్తిన ప్రతీ సారి లంక గ్రామాల ప్రజలు అవస్థలు షరా మూమూలుగా మారుతున్న పరిస్థితి ఉంటుంది.. ముఖ్యంగా ధవళేశ్వరం దిగువన ఉన్న నదీపరివాహక ప్రాంతాల ప్రజలు బాధలు వర్ణణాతీతం.. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఉన్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి.. దీంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరి రాకపోకలు స్తంభిస్తున్నాయి.. ఇప్పటికే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గంలో పి.గన్నవరం, అయినవిల్లి లంక మండలాల్లో 28 లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.. వీరంతా ఇంజను పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు.. అదేవిధంగా రాజోలు, ముమ్మివరం నియోజకవర్గంతోపాటు పుదుచ్చేరీ యానాంలో కూడా వరద వల్ల ఇబ్బందులు తప్పడంలేదు.. గణేష్ నిమజ్జనాలతో అధికారులు అప్రమత్తం... గణపతి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రతీ ఏటా గోదావరి లో గల్లంతయ్యి కొందరు మృత్యువాత పడుతున్న పరిస్థితి కలుగుతోంది.. ఈఏడాది గోదావరి పాయల్లో వరద నీరు భారీగా పోటెత్తడంతో నిమజ్జనాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. నిమజ్జనాలు కేవలం పోలీసులు నిర్దేశించిన స్థలాల్లోనే చేయాలని ఆదేశాలు జారీచేశారు.. అంతే కాకుండా ఉత్సవ కమిటీలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు..
Godavari floods: గోదావరి ఉగ్రరూపం- ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక! కోనసీమలో హై అలర్ట్
Sudheer | 31 Aug 2025 06:27 PM (IST)
Dowaleshwaram Barrage | ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావంతో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గోదావరిలో వరద ప్రవాహం పెరిగి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తోంది..
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం