ప్రముఖ రచయిత, గోదారోళ్ల కితకితల పేరుతో ఫేస్‌బుక్ గ్రూప్ సృష్టించి చాలా మందికి స్ఫూర్తిగా మారిన ఈదర వీర వెంకట సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందారు. గురవారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన 108 కాల్ చేసి ఆసుపత్రికి తరలించేందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంబులెన్స్ వచ్చేసరికే ఆయన తుది శ్వాస విడిచినట్టు  బంధువులు చెప్పారు. -


గోదారి యాసపై సత్యనారాయణకు ఎనలేని మక్కువ. స్వయంగా రచయిత అయిన ఆయన... ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించే వాళ్లు. తమ గోదారి యాసను ప్రపంచానికి చెప్పేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే 2016 ఆయన క్రియేట్ చేసిన ఫేస్‌బుక్‌ చాలా ఫేమస్‌ అయింది.  


గోదారోళ్ళ కితకితలు పేరుతో ఉన్న ఫేస్ బుక్ గ్రూప్ గోదారోళ్లకు ఎంత ఇష్టమో... మిగతా తెలుగు వాళ్లు కూడా అంతే ఇష్టపడేవాళ్లు. గోదావరి యాషపై విపరీతమైన మక్కువతో ఈ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆరోగ్య కరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. 


ఓ ప్రమాదంలో స్నేహితుణ్ణి కాపాడి సంచలనంగా మారారు. ప్రాణం కాపాడిన ఫేస్బుక్ స్నేహం అంటూ అప్పట్లో వార్తలు ప్రసారమయ్యాయి. అనంతరం కొద్ది రోజులకే గ్రూప్ లక్ష మందిని చేరుకుని ఒక ప్రత్యేకత ఏర్పరుచుకుంది. ఇప్పుడు ఆ గ్రూప్‌లో 2 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి ఈవీవీ హాస్య కథనాలతోపాటు మధ్య తరగతి ప్రజల స్థితి గతులపై కట్టి పడేసే కథలు రాస్తూ ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవలే సినిమాల్లో సైతం ప్రవేశించి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆయన లేరనే వార్త అభిమానులను కలచి వేసింది. 


బంధువులు, స్నేహితులు, అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని బొమ్మూరులోని ఆయన స్వగృహం వద్దే ఉంచారు.