Southwest Monsoon : ఈ ఏడాది నాలుగైదు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ప్రస్తుతం నైరుతి రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.
ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను మరో రెండు రోజుల్లో తాకనున్నాయి. వ్యవసాయరంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ ఇటీవల ప్రకటించింది. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సూచించారు.
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మరో మూడు రోజులు ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురువనున్నాయి. నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో జూన్ 6 వరకు తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరులతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. బలమైన ఈదురు గాలులు వీచడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పాత భవనాలలో తలదాచుకోవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో తేలికపాటి జల్లులు..
తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచనుండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. వర్షాలు, బలమైన ఈదురుగాలల నేపథ్యంలో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది.