Gadapa Gdapaku Prbhuthvam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి వేణు డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్ర పురం గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మీరు గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటంటూ గ్రామస్థులు నిలదీశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మంత్రి వేణుకు సమస్యలు చెబుతున్న గ్రామస్థులను నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నారు.


పోలీసులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వాటినే మంత్రికి చెబుతుండగా... పోలీసులు అడ్డుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో మంత్రి పోలీసులకు అడ్డు చెప్పకుండా... తమ సమస్యలను కూడా వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిక సమస్యల పై సమాధానం చెప్పకుండానే మంత్రి వేణు వెనుతిరిగారు.


ఆ సమస్యలపై గత ఎన్నికల్లోనే హామీలు ఇచ్చారని... ఇప్పుడు మాత్రం మొహం చాటేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రిని గ్రామస్థులు నిలదీస్తున్న టైంలో... వీడియోలు తీయడంపై ఆయన అనుచరులు సీరియసస్ అయ్యారు. చేతిలో పట్టుకున్న టార్చ్‌ లైట్లను వీడియోలు తీససే సెల్‌ఫోన్లపై వేశారు. ఇలా వీడియోల్లో మంత్రి మొహం కనిపించకుండా అడ్డుపడ్డారు.  


వచ్చే ఎన్నికల్లో అన్నీ స్థానాలు తామే గెలుచుకునేందుకు సీఎం జగన్ ఈ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఇందులో పాల్గొనాల్సిందేనని సీరియస్ గా చెప్పడంతో.. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు నేతలకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. 


ప్రతీ రోజూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలాపురం ఎమ్మెల్యే


కమలాపురం నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో ఇంటింటికి వెళ్లి  ప్రభుత్వం చేసిన సాయం గురించి చెప్పి ఓట్లు అడుగుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి..  విన్ పల్లె మండలం అందెల గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. ఆయన గ్రామంలోకి వెళ్లిన సమయంలో గ్రామస్తులు ఒక్క సారిగా చుట్టుముట్టారు. గ్రామ సమస్యలు గురించి వివరించారు. కొంత మంది సమస్యలుచెబుతున్న సమయంలోనే.. మరో వ్యక్తి తన సమస్యను చెప్పడానికి ప్రయత్నించాడు. ఒకటి , రెండు సార్లు ఎమ్మెల్యే ఆగమని చెప్పినా ఆయన వినపించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన రవీంధ్రనాథ్ రెడ్డి ఆయనపై గట్టి అరిచి..  చేత్తో ఒక్క దెబ్బ వేశారు. దీంతో ఆ వ్యక్తి సైలెంట్ అయ్యారు. తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి అందరితో మాట్లాడి వెళ్లిపోయారు. 


పథకాలపై ప్రశ్నించిన ఓ గ్రామస్తుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే





అయితే గ్రామస్తుడ్ని .. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేయి చేసుకుంటున్న వీడియోను ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దాన్న ఇతరులకు షేర్ చేయడంతో.. ఆ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో కడప జిల్లాలో వైరల్‌గా మారడంతో రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దురుసుగా ప్రవర్తించారని.. అధికారం ఉందనే అహంకారంతో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందెల గ్రామస్తులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు. 


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో -  స్పందించని ఎమ్మెల్యే


కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి .. ముఖ్యమంత్రి జగన్‌కు సొంత మేనమామ.  కడప మేయర్‌గా పని చేసిన ఆయన రెండు సార్లు కమలాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తీరుపై నియోజకవర్గంలో పలు రకాల విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. తమ పార్టీ వారు తప్ప ఇతరులతో ఆయన దురుసుగా వ్యవహరిస్తూంటారని  చెబుతూంటారు. తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో.. మరోసారి ఆయనపై విమర్శలకు అవకాశం ఏర్పడింది.