Dowleswaram irrigation office | ధవళేశ్వరం: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దగ్దం తరువాత తూర్పుగోదావరి జిల్లాలోనే అలాంటి సీన్ రిపీట్ అయింది. టీటీడీలోనూ కొన్ని ఫైళ్లు కాలిపోయిన ఘటన సైతం సంచలనంగా మారింది. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం కేసులో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబీలతో పాటు స్పెషల్‌ ఆర్‌ఐ కళాజ్యోతి, సబార్డినేట్‌ రాజశేఖర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి సస్పెండ్‌ చేశారు. దాంతోపాటుగా డిప్యూటీ తహసీల్దార్లు ఎ. సత్యదేవి, ఎ. కుమారిలకి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఆఫీసు కాగితాలు దహనం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.


పోలవరం ప్రాజెక్టు ఫైళ్లు దగ్ధం


విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం వద్ద కొన్ని ఫైళ్లు కాలిపోయి కనిపించగా పోలీసులకు, అధికారులకు కొందరు సమాచారం అందించారు. కొందరు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి శనివారం నాడు పరిశీలించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ (Polavaram Left Canal) భూసేకరణ విభాగానికి సంబంధించిన ఫైళ్లు అని తెలుస్తోంది. అయితే ఆఫీసు గేటు బయట సిబ్బంది కొన్ని ఫైళ్లను కాల్చేశారు. విషయం ప్రచారం కావడంతో సగం కాలిన మిగతా ఫైళ్లను సిబ్బంది మళ్లీ లోపలకు తరలించారు. ఓవైపు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు, మరోవైపు వారంతా సెలవులో ఉన్నప్పుడు ఇది జరిగింది. ఆ ఫైళ్లను ఆఫీసు గేటు బయట వేసి కాల్చివేసిన స్వీపర్‌ విశాఖ వెళ్లిపోవడంతో అధికార కూటమి నేతల అనుమానాలు వ్యక్తం చేశారు. 


శాఖ పరమైన విచారణ చేపడతామన్న కలెక్టర్


సమగ్ర శాఖా పరమైన విచారణ చేపడతామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ ఘటనతో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో డిప్యూటీ కలెక్టర్ కె వేదవల్లి ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 211/2024  ఎఫ్ ఐ ఆర్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు పోలీసు స్టేషన్ లో 326 (ఎఫ్) రీడ్ విత్ 3(5) భారతీయ న్యాయ సమ్మత చట్టం, సెక్షన్ 4 ఆఫ్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చట్టం 1984 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫైళ్లు దగ్దంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు, శాఖ పరంగా కూడా విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.