Pithapuram News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు కథం తొక్కారు.. తీరప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా విస్తరించిన కాలుష్యకారక పరిశ్రమలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనబాట పట్టారు.
యూ.కొత్తపల్లి తీరప్రాంతాల్లో అసలేం జరుగుతోంది..
కాకినాడ రూరల్ ప్రాంతంలోని తీర ప్రాంతం నుంచి తుని మండలం అద్దరిపేట తీర ప్రాంతం వరకు ఉన్న తీరప్రాంతంలో ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలో మత్స్యసంపద తీవ్రంగా నష్టపోయి తమ జీవనం దెబ్బతింటుందని గత కొంత కాలంగా మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. తీరానికి ఆనుకుని ఉన్న ఫార్మా పరిశ్రమల వల్ల సముద్రజలాలు కాలుష్యానికి గురికావడమే కాకుండా పరిసర ప్రాంతాలు కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు గతంలో వినతిపత్రం సమర్పించారు.. కాలుష్య నియంత్రణ మండలి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ అవ్వడం వల్ల వెంటనే చర్యలు తీసుకోవాలని, వేటే జీవనాధారం చేసుకుని జీవిస్తున్న తమ జీవనాధారం దెబ్బతీస్తున్న ఫార్మా కంపెనీల నుంచి పరిహారం ఇప్పించాలని కోరారు..
ఉప్పాడ తీరంలో నిరసన తెలిపిన గంగపుత్రులు..
పిఠాపురం నియోజకవర్గంతోపాటు తుని నియోజకవర్గ పరిధిలోకి వచ్చే యు.కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలోని తీరప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల ద్వారా కోనపాపపేట, పెరుమళ్లాపురం, అద్దరిపేట తదితర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాలుష్యకారక పరిశ్రమలను తొలగించాలంటూ మత్స్యకారులు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ రోడ్డు రింగ్ రోడ్డు సెంటర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా సముద్ర జలాల కాలుష్యం వల్ల మత్స్య సంపద అంతరించే పోవడంతో జీవనం సాగించలేక మా ఆకలి కేకలు ఎవరికి వినిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలోకి నేరుగా కలుషిత జలాలు వదిలి వేయడంతో గత కొంతకాలంగా అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్న ఎప్పటికీ పట్టించుకునే దాఖలాలు లేవని మండిపడ్డారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని, అయితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదని తెలిపారు. వేట తప్ప వేరే పని చేతగాని మత్స్యకారుల సమస్యను తీర్చకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తీర ప్రాంతాలలోని అన్ని గ్రామాల నుంచి ఏకతాటిపైకి వచ్చిన మత్స్యకారులు ఉప్పాడ సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా బైఠాయించి తమ నిరసన తెలిపారు. ప్రధాన సెంటర్లో ఉన్న భవనాలపైకి ఎక్కి మరి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత వాసులకు ఎటువంటి ఉపాధి కల్పించడం లేదని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫ్యాక్టరీలు ఇష్టానుసారంగా పెట్టుకొని తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
ఆందోళనకారులతో చర్చించిన జేసి, అడిషనల్ ఎస్పీ
మత్స్యకారుల నిరసనకు స్పందించిన జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అడిషనల్ ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ , కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు స్వయంగా మత్స్యకారులతో చర్చలు జరిపారు. మత్స్యకారుల పెద్దలు వస్తే చర్చించి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మత్స్యకారులు వారి మాటలు పట్టించుకోకుండా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం రావాల్సిందే..
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీర ప్రాంతానికి వచ్చి తమ సమస్యను పరిష్కారం చూపాలని చూపాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలంటూ మత్స్యకారులు చేస్తున్న నినాదాలతో ఉప్పాడ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికి అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన రేగుతోంది