Narasapur Vande Bharat: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. ఆమేరకు రైల్వే డిపార్ట్మెంట్ వివరాలు వెల్లడించింది.        

Continues below advertisement

ఫలించిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి       

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు ​శ్రీనివాస వర్మ గత కొన్ని నెలలుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం పట్టుబడుతున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చాలా సార్లు ఈ విషయమై భేటీ అయ్యారు. వాటి ఫలితం గా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి మంజూరు అయ్యాయి. దానివల్ల ఇప్పటివరకు చెన్నై (ఎంజీఆర్ చెన్నై సెంట్రల్) నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్లు: 20677/20678)ను నర్సాపురం-చెన్నై వందే భారత్ గా మార్చారు.        

Continues below advertisement

నరసాపురం రైల్వే టైమింగ్స్ ఇవే           

ఈ రైలు పొడిగింపుతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతోపాటు కోనసీమ వాసులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. నర్సాపురం వరకు పొడిగించిన వందే భారత్ ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ​రైలు నంబర్ 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపురం వరకు, అలాగే రైలు నంబర్ 20678 నర్సాపురం నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు నడవనుంది.            

చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( 20677 నెంబర్) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతూ విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.      

తిరుగు ప్రయాణంలో 20678 నెంబర్ రైలు నర్సాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని, 4:09 గంటలకు గుడివాడ చేరుకుని, 4:50 గంటలకు విజయవాడకు చెన్నైకు రాత్రి 23.45 గంటలకు చేరుకుంటుంది. అధికారిక ప్రారంభ తేదీని రైల్వే శాఖ అతిత్వరలో తెలియజేయనుంది.         

విజయవాడ స్టేషన్ లో ప్లాట్ ఫామ్ కొరతే అసలు కారణం        

ప్రస్తుతం చెన్నై- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ విజయవాడ మధ్యాహ్నం 12:10 కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 15:20 కి విజయవాడలో బయలుదేరి చెన్నై వెళుతోంది. అంటే 3 గంటలపైన ఈ రైలు కోసం విజయవాడలో ఒక ప్లాట్ ఫామ్ బ్లాక్ అయిపోతోంది. ఇప్పుడు ఈ ట్రైన్‌ను నరసాపురం వరకూ పొడిగించడం వల్ల విజయవాడ స్టేషన్‌లో ఆ ఇబ్బంది ఉండదు. రైల్వే శాఖ ఆలోచనకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రయత్నాలు తోడు కావడంతో నరసాపురాని తొలి వందే భారత్ వచ్చినట్టు అయింది. ఇది ఎప్పటి నుంచి అనేది అతి త్వరలోనే తెలియజేయనున్నారు.