YS Jagan Padayatra: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన వైసీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు చేరువ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్న వైసీపీ అధినేత జగన్ 2027లో పాదయాత్రతో నిత్యం ప్రజల్లోనే ఉంటారని నేతలు చెబుతున్నారు. ఇది ఎలా ఉంటుందనే విషయంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 

Continues below advertisement

2017లో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఎనిమిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా విజయవాడలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని 2027లో మరో ప్రజా సంకల్ప యాత్ర ఉంటుందని ప్రకటించారు. ప్రజల్లో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకునేందుకు వారికి ఓదార్చేందుకు తర్వాత వచ్చే ప్రభుత్వంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం జగన్  పాదయాత్ర చేయబోతున్నారని అన్నారు. 2027లో మొదలు కానున్న నయా పాదయాత్ర 2029 ఎన్నికల్లో విజయం సాధించే వరకు సాగుతుందని తెలిపారు. దాదాపు రెండేళ్ల పాటు యాత్ర చేస్తారని పేర్కొన్నారు. నాడు ఎలా ప్రజలను కదిలించిందో ఇప్పుడు కూడా అలానే ప్రజలను ఈ నయా సంకల్ప యాత్ర కదిలిస్తుందని తెలిపారు. 

జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలతోపాటు చెప్పని వాటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారని నాని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలు వాటిని గుర్తు చేసుకుంటున్నారని అందుకే ఆయన ఎక్కడకు వెళ్లిన బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇదే స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

Continues below advertisement

చాలా హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని మర్చిపోయి వైసీపీ నేతలను అరెస్టు చేయడం, రాజకీయ కక్ష సాధింపులు చేయడానికే పరిమితం అవుతుందని అన్నారు. ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని అందుకే జనం వైసీపీని, జగన్‌ను కోరుకుంటున్నారని అన్నారు.