గంజాయి విక్రయిస్తే చేస్తే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తాం.
ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌..


గంజాయి విక్రయాలు జరిపితే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ హెచ్చరించారు. ఏలూరు రేంజ్‌లోని ఆరుజిల్లాల పరిధిలో నిఘా నిరంతరం కొనసాగిస్తున్నామని, గంజాయి తరలించినా, విక్రయించినా పీడీయాక్ట్‌ అమలు చేస్తామని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా పట్టుబడితే అవసరమైతే ఆ రాష్ట్ర పోలీసులతో మాట్లాడి అక్కడా కేసులు పెట్టించడమే కాకుండా గంజాయి రవాణాను అడ్డుకట్టవేస్తామన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన జిల్లా ఎస్పీ శ్రీధర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయడంలో సత్ఫలితాలు సాధించామని, అయితే కొందరు విద్యార్థులు గంజాయి సేవించే వ్యసనాలకు బానిసలవుతున్నట్లు గుర్తిస్తే వారికి వారి తల్లితండ్రులను అప్రమత్తం చేయడంతోపాటు వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


సైబర్‌ నేరాలపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ..
ఇటీవల కాలంగా సైబర్‌ నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణనిపిస్తున్నట్లు డీఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు ద్వారా జరుగుతోన్న నేరాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. లోన్‌ యాప్‌ల ద్వారా మోసపోయినా వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఎటువంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే దానిపై చర్యలు తీసుకుని పోగొట్టుకున్న డబ్బును ఏవిధంగా రికవరీ చేయాలి అనే దానిపై ఇప్పటికే శిక్షణ ఇచ్చిటనట్లు తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా యువతులను అట్రాక్ట్‌ చేసి మోసం చేస్తున్న పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు మహిళా పోలీసుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.


పోక్సో నేరాలపై ఎస్పీలే పర్యవేక్షిస్తారు..
పోక్సో నేరాలపైనా, సీరియస్‌ అఫెన్సెస్‌పై జిల్లా ఎస్పీలే ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించినట్లు డీఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. శిక్షపడితేనే నేరస్తులకు భయం అనేది కలుగుతుందన్నారు. సీరియస్‌ అఫెన్సెస్‌ విషయంలో ఎస్పీలే ప్రత్యేక దృష్టిపెట్టి నిందితునికి శిక్షపడేందుకు పర్యవేక్షిస్తున్నారన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రంలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ ప్రత్యేకంగా దిశ డీఎస్పీనికూడా నియమిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. 


శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.. ఏలూరు రేంజ్‌ పరిధిలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఇటీవల పలు ర్యాలీలు సందర్బంగా అక్కడక్కడా చోటుచేసుకున్న వివాదాలనేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ శ్రీలత, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.