Prathibha Bharati: పచ్చ చొక్కా వేసుకుంటే చాలు అరెస్టులు చేస్తున్నారని, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని.. తల్లిని, చెల్లిని చూసుకోలేని వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తారు అని మాజీ మంత్రి ప్రతిభా భారతి వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాపు కల్యాణ మండపంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ మినీ మహానాడుకు శాసన సభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి కే.ప్రతిభా భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పచ్చ చొక్కా వేసుకుంటే చాలు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టీ జైల్లో వేస్తున్నారని అన్నారు. పోరాటం తమకు కొత్త కాదని.. భయపడే ప్రసక్తే లేదని ఆమె చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చి.. ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు లేవు, గృహ నిర్మాణాలు లేవని దుయ్యబట్టారు. పేదవాడు కడుపు నింపే అన్న క్యాంటీన్లను తొలగించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలకులు పేదల నడ్డి విరిచారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో వ్యవసాయ పనిముట్లు ఇచ్చి అనేక పథకాలతో రైతులను ఆదుకున్నామని ప్రతిభా భారతి గుర్తు చేశారు. ప్రస్తుతం కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ కోతల రాయుళ్లు కోతలు తప్ప ఇంకేముందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్నారు. రాష్ట్రం మొత్తం ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎక్కడకు వెళ్లినా కేసులు పెడుతున్నారని, ప్రజాప్రతినిధులు మనుషులా రాక్షసులా అంటూ ప్రశ్నించారు.
వినాశకాలే విపరీత బుద్ది అన్న సామెత వైసీపీ పాలకులకు కరెక్టుగా సరిపోతుందన్నారు. శిశుపాలునికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని ప్రతిభా భారతి అన్నారు. ఎన్నికలు వచ్చాక కచ్చితంగా శిరచ్ఛేదనం జరుగుతుందని పేర్కన్నారు. వైసీపీని ప్రజలు కచ్చితంగా గద్దె దించుతారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న మీ ప్రభుత్వాన్ని ఓడించి.. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. తల్లిని, చెల్లిని చూడని వ్యక్తి ప్రజలను ఏం చూస్తాడని అన్నారు.