ED Probe On Kakinada Port Issue | అమరావతి: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు ఉన్నాయనే కారణంగా ఎంపీ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాలతో అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి విచారణకు హాజరు కాలేదు.
మరోసారి ఈడీ నోటీసులు
ఈ కేసులో ఎంపీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇప్పటికే విచారణకు హాజరు కాగా, విచారణకు రావాలని విక్రాంత్ రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ. 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది, ఎవరిచ్చారు అనేదానిపైనే విచారణ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లో రూ.3600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి తీసుకున్నారు. అయితే తననుంచి బలవంతంగా లాగేసుకున్నారని కేవీ రావు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదు చేశారు. పోర్టు వ్యవహారంలో ఆరో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ కు చెల్లించిన రూ.494 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోమని అరవిందో సంస్థకు ఏపీ సిఐడి లేఖ రాసింది. డివిడెండ్లు తీసుకున్నా చర్యలు తప్పవని సీఐడీ హెచ్చరించింది. వేరొకరి నంచి లాక్కోవడమే అక్రమం అవుతుందని, దాని నుంచి లాభాలు పొందడం కూడా నేరమే అని స్పష్టం చేసింది. నాలుగేళ్ల వ్యవధిలో రూ.102 కోట్లు తీసుకున్నారని, ఇక ఆపేయండంటూ అధికారులు స్పష్టం చేశారు. అరబిందో డైరెక్టర్లను విచారించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి నేడు సీఐడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణకు సంబంధించి ఇప్పటికే అరవిందో సంస్థకు ఏపీ సిఐడి లేఖ రాసింది.
చిక్కుల్లో అరబిందో సంస్థ
గత ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడిందన్నారు ఏపీ సీఐడీ చీఫ్. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో తీసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో డైరెక్టర్లు, ఆరో ఇన్‌ఫ్రా సంస్థకు సీఐడీ లేఖలు రాసింది. బెదిరింపులకు పాల్పడి 2021లో కేవీ రావు నుంచి 41.12 శాతం వాటాలు లాక్కున్నారని, దానిపై వచ్చిన లాభాలు, డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆ లేఖలో స్పష్టం చేశారు.
మీతో ఆధారాలుంటే ఇవ్వండి, చట్టప్రకారం చర్యలు
‘నాలుగేళ్లలో డివిడెంట్ కింద రూ.102కోట్లు తీసుకున్నారు. కేవీ రావు నుంచి యాజమాన్య హక్కులు లాక్కోవడంపై విచారణ జరుపుతున్నాం. దీనికి సంబంధించి అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారంపై విచారణ జరుపుతున్నాం. పూర్తి హక్కులున్న కేవీ రావును బెదిరించినట్లు ఆయన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం. మీరు ఒక్క అడుగు ముందుకేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాం. కాకినాడ పోర్టుపై పూర్తి హక్కులు తనకే ఉన్నట్లు కేవీ రావు ఆధారాలు సమర్పించారు. మీతో ఆధారాలు ఉంటే సమర్పించండి. దీనిపై న్యాయబద్ధంగా విచారణ చేస్తాం. బాధితుడిగా ఉన్న కేవీరావు హక్కులను కాపాడాల్సిన తమపై ఉందిని’ సిఐడి చీఫ్ లేఖలో తెలిపారు.