పెళ్లి మండపం వద్ద హైడ్రామా: పెళ్లి కొడుకు పరార్, షాకింగ్ నిజాలు.. యువతి జీవితం ప్రశ్నార్థకం!
పెళ్లి అంటే నూరేళ్ల పంట అనే మాట ఈ నాటిది కాదు.. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పెళ్లి వేడుక.. దానికోసం అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో ఎదురు చూస్తుంటారు.. సరిగ్గా అలాగే కలలు కంది ఓ యువతి.. పెద్దలు కుదిర్చిన వివాహంకు అంగీకరించిన వధువు మరికొన్ని గంటల్లో పెళ్లి మంటపానికి వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.. మరో పక్క పెళ్లి వేడుకకు వచ్చిన బంధు మిత్రులు విందు ఆరగిస్తున్నారు.. మేళతాళాలుతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది.. తెల్లవారు జామున పెళ్లి అవ్వడంతో సాయంత్రం పూట పెట్టుకున్న భోజనాలు పూర్తయ్యాక అక్కడి నుంచి పెళ్లి మంటపానికి వెళ్లాల్సి ఉంది.. ఇంతలో షాకింగ్ న్యూస్ పెళ్లి కొడుకు బంధువుల నుంచి వచ్చింది.. రెండు గంటల నుంచి పెళ్లి కొడుకు కనిపించడం లేదు.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ పెళ్లి ఇంట చావు కబురులా వినిపించారు.. నూరు అబద్దాలు అడైనా పెళ్లి జరిపించాలని పెద్దలు చెబుతుంటారు.. సరిగ్గా ఇలేనే ఆబద్దాలు ఆడి ఏదిఏమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఏమో కానీ పెళ్లి కొడుకు అబద్దాల మీద అబద్దాలు ఆడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. అప్పటికే భర్త చనిపోయిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడని, తీరా ఆమె బెదిరించడంతో భయపడి పారిపోయాడన్న విషయం తెలుసుకుని షాక్‌కు గురవ్వడం పెళ్లి కూతురు బంధువుల వంతయ్యింది..
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి మూలస్వామి, వెంకటదుర్గ కుమారుడు పాలి వీరవెంకట నాగ సత్యనారాయణతో వివాహ సంబందం కుదిరింది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల బంధువులు అన్ని లాంఛనాలు మాట్లాడుకుని ఆగస్టు 12న తెల్లవారితే 13 వ తేదీ 3 గంటలకు వివాహం జరిపించాలని నిశ్ఛయించుకున్నారు. ఇందుకోసం వధువు స్వగ్రామం అయిన భీమోలులో 12వ తేదీ రాత్రి సుమారు 1500 మంది హాజరయ్యేలా ఎస్టిమేషన్ వేసుకుని విందు ఏర్పాటు చేసుకున్నారు.. తెల్లవారు జామున వరుడు స్వగ్రామంలో వివాహం జరగాల్సి ఉండగా వధువును అక్కడికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.. మరికొద్ది నిముషాల్లో వధువు బయలు దేరేందుకు సిద్ధం అవుతుండగా వరుడు ఇంటి వద్ద పెళ్లి మండపం వద్ద తీవ్ర గందరగోళం మొదలయ్యింది..
పెళ్లి కొడుకు కనిపించడం లేదంటూ సమాచారం..
మరికొద్ది నిముషాల్లో వధువు పెళ్లి కుమారుడు నాగసత్యనారాయణ ఇంటికి బయలు దేరేందుకు సిద్ధం అవుతుండగా పెళ్లి కొడుకు కనిపించడం లేదంటూ వధువు ఇంటివారికి సమాచారం అందింది.. సుమారు రెండు గంటల నుంచి పెళ్లి కోడుకు నాగ సత్యనారాయణ కనిపించడం లేదని, వెతికినా ఎక్కడా లేడని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని వరుడి బంధువులు తెలిపారు. దీంతో వధువు కుటుంబికులు, బంధువులు పెళ్లి కొడుకు కుటింబికులను నిలదీశారు..
ఒంటరి మహిళను వివాహం చేసుకుని.. ఆపై మళ్లీ పెళ్లికి..
ఎర్నగూడెం గ్రామానికి చెందిన భర్త చనిపోయిన ఓ మహిళతో నాగ సత్యనారాయణకు అయిదేళ్ల క్రితం వివాహం అయ్యిందని ఆమెతో ఉంటున్నాడని తెలిసింది. పైగా ఆమె కుమార్తెకు కూడా సత్యనారాయణ వివాహం జరిపించాడని తేలింది.. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ బెదిరించడంతో మరికొన్ని గంటల్లో వివాహం ఉండగా పారిపోయాడని వధువు బంధువులుకు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వధువు కుటుంబికులు పోలీసులను ఆశ్రయించారు..
నిత్యపెళ్లి కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్..
తనకు అప్పటికే పెళ్లయ్యి మరో యువతి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా పెళ్లి పేరుతో పరువును, ఆర్దీకంగా నష్టం కలిగేలా మోసం చేసిన పాలి వీరవెంకట నాగ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వధువు కుటుంబికులు డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే నిందితున్ని అరెస్ట్ చేయాలని దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కూతురు తన జీవితం నాశనం అయ్యిందని తీవ్ర మనస్థాపానికి గురైందని, ఆమె ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనన్న భయంతో ఇంటి దగ్గర కాపలా పెట్టి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చామని వధువు బంధువులు తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న సత్యనారాయణ మరో యువతి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడని, అటువంటి వ్యక్తిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా చట్టప్రకారం ఎంత వరకు న్యాయం చేయాలో అలా చేస్తామని దేవరపల్లి సీఐ నాగేశ్వరనాయక్ వారికి హామీ ఇచ్చారు..