రాజమహేంద్రవరం రూరల్‌లోని ధవళేశ్వరం పునరావాస కేంద్రంలో ముంపు ప్రాంతాలలోని కుటుంబాలకు వసతి ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ధవళేశ్వరంలోని వాడపేట ఎంపిపి పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాసితులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ... పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఇంటిని తలపించేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్వాసితులు వారి ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వచ్చినందున చక్కని ఆహారం, దుప్పట్లు, చక్కని శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వరద బాధితులను గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా రూ.2 వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర సరకులు 25 కేజీలు బియ్యం, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజి బంగళాదుంప, ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందచేయాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.


ఈ పునరావాస కేంద్రాల ఏర్పాట్లలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు మెరుగైన పనితీరు చూపుతున్నారని మాధవీలత పేర్కొన్నారు. వరదల సమయంలో వాలంటీర్లు పనితీరును కలెక్టర్ ప్రశంసించారు మాధవీలత. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడం, గోదావరి గట్లు తెగిపోకుండా చూడడంలో, సమాచార లోపం రాకుండా అధికారులతో సమన్వయంతో చక్కటి పనితీరు చూపినట్లు పేర్కొన్నారు.


నిర్వాసితులతో కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి, వారితో కలిసి కలెక్టర్, రూడా చైర్ పర్సన్ భోజనం చేశారు. ఏర్పాట్ల పట్ల నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రంలో ఉన్న నిర్వాసితులకు నిత్యవసర వస్తువులు నగదు పంపిణీ చేశారు.


వరదలు కారణంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలు నానా అవస్థలు పడ్డారు. నీళ్లు, భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలకు తాగేందుకు పాలు కూడా దొరకలేదు. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది.


ఇప్పటికే ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలన చేశారు. శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. వరద ప్రభావిత గ్రామాలలో విష సర్పాల బెడద తీవ్రంగా కనిపిస్తుంది. మరోపక్క వ్యాధుల బెడద కూడా అంతే స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కోనసీమలో వరద  కష్టాలు తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి.