Rescue Teams: ఆంధ్ర ప్రదేశ్ లో గత వారం, పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. వేలాది గ్రామాలు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లో విపరీతమైన వరదల కారణంగా చాలా మంది తెగ ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలో భారీ వరదల కారణంగా.. ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు విస్తృతంగా సేవలు అందించాయి. ఇప్పటి వరకు మొత్తం 11 వందల 81  మందిని వరదల నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ వివరాలు.


 3వ బెటాలియన్ నుంచి 2 ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు


3వ బెటాలియన్ నుంచి రెండు ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు.. మొత్తం 65 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వరద బాధితులకు ఆహారం ప్యాకెట్లతో పాటు మంచి నీటిని అందజేశారు.


5వ బెటాలియన్ నుంచి 2 ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు


5వ బెటాలియన్ నుంచి రెండు ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు.. మొత్తం 76 మంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలో వరద బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగారు. థానేలంక ముమ్మిడివరం, మామిడికుదురు గ్రామాలకు చెందిన 18 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం ప్యాకెట్లతో పాటు తాగు నీటిని కూడా పంపిణీ చేశారు. 


6వ బెటాలియన్ నుంచి 2 ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని లంక రేవు, టేకుచెట్టు పాలెం, ఏలూరు జిల్లాలోని కుకునూరులో వరద ప్రభావిత ప్రాంతాల గ్రామాలకు చెందిన 791 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత బాధితులకు ఆహారం ప్యాకెట్లు మరియు త్రాగు నీటిని సరఫరా చేయటం జరిగింది.


9వ బెటాలియన్ నుంచి 2 ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు


మొత్తం 70 మంది సిబ్బంది తోక లంక వద్ద వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన స్థానిక పడవల ద్వారా పర్యవేక్షిస్తూ, ప్రాంతాలను ఖాళీ చేయమని నిరంతరం ప్రకటించడం మరియు అభ్యర్థించడం మరియు రామచంద్రపురంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.


16వ బెటాలియన్ నుంచి 2 ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలు


డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లాలోని అయినవల్లి లంక, పొట్టిలంక, తోటరాముడి, మడిపల్లిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం వద్ద గ్రామాలకు చెందిన 272 మందిని మొత్తం 80 మంది అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వరద ప్రభావిత బాధితులకు ఆహార ప్యాకెట్లు, తాగు నీటిని అందజేశారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వ‌ర‌ద‌ల్లో విరివిగా ప‌ని చేస్తున్నాయి. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని నాలుగు మండ‌లాల్లోని 12 గ్రామాల్లో 644 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. మ‌రో 110 మందిని వ‌ర‌ద ముంపు నుండి కాపాడారు. ఇక్క‌డ ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. ఎట‌పాక మండంలోని గుండాల గ్రామంలో 591 మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. మ‌రో 67మందిని ముంపు నుండి రక్షించారు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని సీతాన‌గ‌రం మండ‌లం ముల‌క‌ల్లంక గ్రామంలో 154 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. 


డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని 8 మండ‌లాల్లోని 14 గ్ర‌ామాల‌ నుండి 68 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఏలూరు జిల్లాలోని 2 మండ‌లాల్లోని 7 గ్రామాల్లో 51 మందిని ఎన్డీఆర్ఎఫ్  బృందాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని 3 మండ‌లాలు 4 గ్రామాల్లో అత్య‌దికంగా 1368 మందిని ఎన్డీఆర్ఎఫ్  బృందాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. మ‌రో ఐదుగురిని వ‌ర‌ద ముంపు నుండి కాపాడారు.