Dowleswaram Barrage gets international honour: ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా కాటన్ బ్యారేజీని గుర్తించిన ఐసీఐడీ
ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సంస్థ గుర్తింపును ఇచ్చింది. దేశంలో నాలుగు సాగునీటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కగా.. అందులో ధవళేశ్వరం ఆనకట్ట ప్రథమ స్థానంలో నిలిచింది. దీనిని ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలు గుర్తింపు పత్రాన్ని అందుకున్నారు. 


డెల్టా ప్రజలకు అన్నపూర్ణగా ... 
ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువలా వచ్చి చేరిన వరద జలాలు నిరూప యోగంగా సముద్రంలో కలిసిపోయి అక్కరకు రాకుండా పోవడాన్ని గుర్తించిన బ్రిటీష్ ఇంజనీర్ కాటన్ ఎన్నో ఏళ్లు బ్రిటీష్ పాలకులతో పోరాడి ఒప్పించి నిర్మించిన ఆనకట్ట ఇది. 1847లో నిర్మాణం ప్రారంభించి1852 నాటికి పూర్తికాగా, ఈ ఆనకట్ట బలహీన పడటంతో 1966లో కాసుబహ్మనందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆధునికీకరించేందుకు పనులు ప్రారంభించారు. ఆనకట్టతోపాటు దానిపై రోడ్డు మార్గం కూడా ఉండేలా డిజైన్ చేసి 1970లో నిర్మాణ పనులు ప్రారంభించారు. 1982లో పూర్తి అయిన క్రమంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతులమీదుగా ప్రారంభించారు.


అన్నీ ప్రత్యేకతలు కలిగిన బ్యారేజ్‌గా గుర్తింపు..
నాలుగు భాగాలుగా ఉన్న ఈ ఆనకట్ట ధవళేశ్వరం - పిచ్చుకలంక, పిచ్చుకలంక- బొబ్బర్లంక, బొబ్బర్లంక - మద్దూరులంక, మద్దూరులంక విజ్జేశ్వరం ఉన్న ఆనకట్ట పొడవు 3.7 కిలోమీటర్లు. ఈ బ్యారేజ్ కు మొత్తం 175 గేట్లు ఉండగా అత్యంత స్పిల్ వే ఉన్న బ్యారేజీగా గుర్తింపు ఉంది. వీటి ద్వారా ఎగువ ప్రాంత కాలనుంచి తరలివచ్చే వరదను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుంటారు అధికారులు.


భారత్ నుంచి 4 ప్రాజెక్టులకు గుర్తింపు 


ఎన్నో ఏళ్ల నుంచి ఆయకట్టుకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటిని అందిస్తున్న కట్టడాలకు ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు ఇస్తోంది ఐసీఐడీ. ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో జరుగుతున్న 24వ కాంగ్రెస్ లో ప్రపంచ వ్యాప్తంగా 22 ప్రాజెక్టులకు గుర్తింపు లభించగా.. అందులో దేశానికి చెందిన 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీ నుంచి దవళేశ్వరం బ్యారేజీ, తమిళనాడులోని లోయర్ ఆనకట్ట, ఒడిశాలోని రుషికుల్య, బైతరణి ప్రాజెక్టులకు ఈ ఏడాది వాసరత్వ సాగునీటి కట్టడాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. 


కాటన్ ను దైవంగా మార్చిన ఆనకట్ట.. 
గోదావరి ప్రజలకు కాటన్ మహాశయుడు దైవంతో సమానం. తమ కోసం ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కాటన్ విగ్రహాలు అనేకం ఉంటాయి. ఆయన జయంతి, వర్ధంతి రోజు గోదావరి జిల్లా ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇంకా విశేషమేంటంటే చాలా మంది రైతుల ఇళ్లల్లో దేవతలు, దేవుళ్లు ఫొటోల పక్కన బ్రిటీష్ ఇంజినీర్ కాటన్ ఫొటోలు పెట్టి పూజించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.