YSRCP TDP Fight In Denduluru: ఏలూరు జిల్లా దెందులూరులో రోజురోజుకూ పరిస్థితి అదుపుతప్పుతోంది. అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య తరచూ ఏదో ఓ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారులు బాహాబాహీకి దిగారు. ఏకంగా పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో మోహరించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగడంతో పరిస్థితి కొంత సమయానికి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. దెందులూరు వైసీపీ, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్ అమలుచేశారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దంటూ పోలీసులు మాక్ డ్రిల్ల్ నిర్వహిస్తున్నారు.


చిచ్చు రేపిన ఫేస్‌బుక్ పోస్ట్..
ఏలూరు జిల్లాలో ఓ ఫేస్‌ బుక్‌ పోస్ట్ అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ధ్య వివాదానికి కారణమైంది. దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తిని కించపరుస్తూ పోస్టు పెట్టాడు. ఇది గమనించిన ప్రత్యర్థి వర్గం జీర్ణించుకోలేకపోయింది. తమను కించపరిచేలా పోస్టు పెట్టిన వ్యక్తిపై దాడికి ప్లాన్ చేశారు. సమాచారం అందడంతో దెందులూరు పోలీసులు సోషల్ మీడియాలో కించపరిచే పోస్ట్ పెట్టిన వ్యక్తిని ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయులు పీఎస్ వద్దకు చేరుకుని పరస్పర దాడికి సిద్ధమయ్యారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఎస్సై వీర్రాజు గాయపడ్డారు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.  


Also Read: Chintamaneni Prabhakar: ప్రాణహాని ఉందన్నా పోలీసులు పట్టించుకోలేదు - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆవేదన


కాగా, చింతమనేని ఏలూరు మొబైల్ కోర్టులో ఓ ప్రైవేటు కేసు కూడా దాఖలు చేశారు. ‘‘నన్ను ఎన్‌ కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నాలు చేసింది. టీడీపీ నాయకులు కనుక స్పందించకపోయి ఉంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. నా తరపు న్యాయవాదికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి వార్నింగ్‌ లు ఇచ్చారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నేను ప్రశ్నించినందుకు నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నవ్‌జ్యోత్‌సింగ్‌ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు అందుకు సహకరించిన 21 మందిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఏలూరు మొబైల్‌ కోర్టులో చింతమనేని ప్రభాకర్‌ ప్రైవేటు కేసు ఫైల్ చేశారు.


Also Read: Chintamaneni Prabhakar: టీడీపీ లీడర్ చింతమనేని హత్యకు కుట్ర? బాస్ ఒక షూటర్‌ని నియమించాడట! మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు