డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో కోవిడ్ కేసులు కలవర పెడుతున్నాయి. ఇప్పటికే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం, ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 కోవిడ్ కేసులు వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాట్రేనికోన మండల పరిధిలో మూడు కేసులు, పి.గన్నవరంలో మరో నాలుగు కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏడు కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి దృవీకరించారు. ఇదిలా ఉంటే కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 46 పాజిటివ్ కేసులకు చికిత్స పొందుతుండగా రెండు కోవిడ్ మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా వారికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.
కలెక్టర్ ఏమన్నారంటే..
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కోవిడ్‌తో మృతిచెందారన్న వార్త ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నారని, అయితే మరణించిన ఇద్దరిలో ఒకరు 21 ఏళ్లు గల వ్యక్తి అని వారికి వేరే ఇతర తీవ్ర అనారోగ్య కారణాలున్నట్లు వైద్యులు గుర్తించారని తెలిపారు. వీరికి పరీక్షలుచేయగా కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఇప్పటికే ఏకారణం చేతనైనా ఆసుపత్రిలో చేరినా కోవిడ్ పరీక్షలు యధాతధంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కోవిడ్‌కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విధిగా మాస్కు ధరించాలని తెలిపారు. వైద్యఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు అటు కాకినాడ, ఇటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా హిమాన్షు శుక్లా వెల్లడించారు.
కేసులు పెరుగుతోన్నా కనీస జాగ్రత్తలు లేకనే..
గడచిన వారం రోజుల వ్యవధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం 46 కేసులు వరకు నమోదు కాగా ప్రయివేటు పరీక్షల ద్వారా అధికారికంగా నమోదుకాని కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నాయని, అయితే ఇదివరకు ఉన్న తీవ్రత ఇప్పుడు లేకపోవడంతో చాలా మంది లైట్ తీసుకుంటున్నారని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాట్రేనికోన మండలంలో ఓ పదోతరగతి విద్యార్థికి కోవిడ్ సోకడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆవిద్యార్ధి చేత పరీక్షలు రాయించారు అధికారులు. ఇదిలా ఉంటే కోవిడ్ కేసులు పెరుగుతున్నా ప్రజల్లో అప్రమత్తత కనిపించడం లేదని, ఎవ్వరూ మాస్క్‌లు వాడని పరిస్థితి కనిపిస్తోంది.
ఢిల్లీలో భారీగా కేసులు
ఢిల్లీలో గత 24 గంటల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, సోమవారం 1017 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ నలుగురు చనిపోయారు. హెల్త్ బులెటిన్ ప్రకారం, చనిపోయిన వారిలో ఇద్దరి మరణానికి కారణం కరోనా. ఇది కాకుండా, పాజిటివిటీ రేటు 32.25 శాతానికి పెరిగింది.
ఢిల్లీలో గత 24 గంటల్లో మొత్తం 3153 కరోనా పరీక్షలు జరిగాయి. మరోవైపు, సోమవారం మొత్తం 1334 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 4,976 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2024244కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 26567కి చేరుకుంది.
ఆదివారం సంక్రమణ రేటు 29.68 శాతం
అంతకుముందు, ఆదివారం ఢిల్లీలో 1,634 కొత్త కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి, ఇన్ఫెక్షన్ రేటు 29.68 శాతంగా ఉంది. ఆరోగ్య శాఖ షేర్ చేసిన డేటా నుంచి ఈ సమాచారం అందింది. ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం, ఢిల్లీలో కొత్త కేసులు వచ్చిన తర్వాత, మొత్తం ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 20,23,227 కు పెరిగింది మరియు ముగ్గురు రోగుల మరణం తరువాత, మరణాల సంఖ్య 26,563 కు పెరిగింది.