గతంలో మత్స్యకారులకు చంద్రబాబు ఏ సాయం చేయాలేదని, చంద్రబాబు మంచి పని చేశాడని చెప్పే ధైర్యం చివరికి దత్తపుత్రుడికి కూడా లేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మద్దతు పలికే మీడియాకు కూడా ఆ ధైర్యం లేదని అన్నారు. తాము 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేశామని అన్నారు. చంద్రబాబుతో పాటు, దత్తపుత్రుడు, వారికి సపోర్ట్ చేసే మీడియాను కలిపి దుష్టచతుష్టయం అని జగన్ అభివర్ణించారు. ప్రజలకు ఎంత మంచి చేస్తున్నా, వీరు ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.


కోనసీమ జిల్లా మురమళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేశారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేశారు.


కోనసీమ జిల్లాలోని సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో మొత్తం రూ.109 కోట్లను జమ చేస్తున్నాం. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశాం.’’ అని అన్నారు.


విపక్షాలపై విమర్శలు చేస్తూ.. ‘‘ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అస్సలు నచ్చదు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్‌ చేయిస్తున్నారు. ఆ పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా మీరు చూశారా? కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్‌ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా? కోర్టుకు వెళ్లి మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? మత్స్య కారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశా. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గతంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందేది. ఇవాళ అర్హులు అందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నాం.’’ అని జగన్ అన్నారు.


‘‘మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు.. రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా గెలవలేని దత్తపుత్రుడు మరొకరు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఇలాంటి నాయకుణ్ని ఎపుడైనా చూశారా? నాయకులు ప్రజలను నమ్ముకుంటారు. కానీ చంద్రబాబు దత్తపుత్రుణ్ని నమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం పెడుతుంటే అడ్డుకున్న ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? పేదల పిల్లలు గొప్పవాళ్లు అయితే ప్రశ్నిస్తారని భయపడి చంద్రబాబు అడ్డుకుంటున్నారు.’’ అని వైఎస్ జగన్ అన్నారు.