CM YS Jagan Konaseema Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్లలో "వైఎస్సార్‌ మత్య్సకార భరోసా" పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ.పోలవరం మండలం కొమరగిరికి చేరుకుంటారు. 10.45 గంటలకు మురమళ్ల వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.


కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరిగి బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మురమళ్ళలో ఏర్పాట్లను ముమ్మడివరం ఎమ్మెల్యే వెంకట సతీష్ పరిశీలించారు.


ఈ ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేస్తారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేయనున్నారు. (గతంలో 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.70.04 కోట్ల పరిహారం అందించారు) వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద గంగ పుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలగనుంది.


దావోస్ పర్యటన మే 22 నుంచి
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో కూడా పర్యటించనున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకూ సీఎం జగన్ దావోస్ పర్యటన ఉంటుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పరిశ్రమల  శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఇతర  ఉన్నతాధికారులు  సీఎం జగన్ తో పాటు వెళ్లనున్నారు. వందల సంఖ్యలో కంపెనీలు దావోస్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొంటున్నాయి. దావోస్ ఎకనామిక్ ఫోరమ్ లో కోవిడ్ ముందు, తర్వాత పరిశ్రమల పరిస్థితిపై చర్చ జరగనుంది. రాబోయే కాలంలో పారిశ్రామిక మార్పులపై చర్చ జరగనుంది. పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఎకనమిక్  ఫోరమ్ కంపెనీల పారిశ్రామిక ప్రగతిపై చర్చించే వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో ఏపీ పారిశ్రామిక స్థితిగతులపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ బృందం ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాలను కంపెనీలకు వివరిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఛైర్మన్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. 


పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా 
సీఎం జగన్ మే 22 నుంచి 26 వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్ మూడు రాష్ట్ర స్థాయి సమావేశాలలో పాల్గొనున్నారు. ఈ నెల 23న వైద్యరంగంపై కీలక సమావేశం, 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం, 25న డీసెంట్రలైజ్డ్ సమావేశాల్లో పాల్గొనున్నారు. దావోస్ పర్యటనపై మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ వందల సంఖ్యలో కంపెనీలు దావోస్ ఎకనామిక్ ఫారమ్‌లో పాల్గొంటాయి. దావోస్ పర్యటనతో వెంటనే పెట్టుబడులు రావు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంతో ముందుకు వెళ్లి ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.