చంద్రబాబు హాయాంలో జరగనట్టుగా వారి ఊహలకు అందని విధంగా అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం నిలబడిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో కనీసం కుప్పం ప్రజలకు కూడా మంచి చేయలేదని విమర్శించారు. తాము ఫలానా చేశామని చెప్పుకోలేక ఈ మధ్య నోటికి పని చెబుతున్నారని విమర్శించారు. టీడీపీ అంటేనే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. దత్త పుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చేశారని ఆరోపించారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మ అనుకున్నారని, అందుకే 2019లో దత్త పుత్రుడు, సొంత పుత్రుడు ఇద్దర్నీ అన్నీ చోట్లా ఓడగొట్టారని గుర్తు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
బాయ్ బాయ్ బాబు అంటున్నారు - జగన్
మనం చేసిన ఇంటింటి అభివృద్ధిని గుర్తించి ప్రజలు.. ప్రతి ఒక ఉప ఎన్నికలోనూ, జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. చివరికి కుప్పం మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. దీంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని చెప్పారని అన్నారు. ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు తలపట్టుకొని, ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు కూడా ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని విమర్శలు చేశారు. 1995లో కూడా ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురైన సమయంలో ఇదేం ఖర్మరా బాబూ అనుకొని ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు మన రాజకీయాల్లో ఉండడం ఇదేం ఖర్మరా బాబూ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.
తాను రాజకీయాల్లో ఉండాలంటే, తర్వాతి అసెంబ్లీకి వెళ్లాలంటే.. గెలిపించాలని అవే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు అన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ చంద్రబాబుకు ఉందని, ప్రతి మాటలోనూ, చేష్టలోనూ భయం కనిపిస్తోందని అన్నారు.
ఇన్ని శంకుస్థాపనలు ఇదే తొలిసారి
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నరసాపురం పురపాలక సంఘం మంచి నీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎప్పుడూ జరగలేదని జగన్ అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం ఇదే తొలిసారని అన్నారు.