Pithapuram Municipality News: పిఠాపురం నియోజకవర్గం పేరు మరోసారి మారుమోగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం.. పవన్ కల్యాణ్ వల్ల తరచూ వార్తల్లో నిలుస్తోంది.. అయితే ఈసారి పవన్ కల్యాణ్ వల్ల మాత్రం కాదు... ఇద్దరు ప్రభుత్వ అధికారుల వల్ల.. శనివారం నిర్వహించిన పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పురపాలక కమిషనర్ కనకారావు, డీఈఈ భవానీ శంకర్‌లు ఇద్దరు అందరిముందూ బాహా బాహీకు దిగారు.. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు.. అకస్మాత్తుగా ఇలా ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడికి దిగడంతో ఒక్కసారిగా అందరూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.
అంతవరకు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్న ఇద్దరు అధికారులు వాగ్వాదానికి దిగి ఆపై దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ వ్యవహారం గురించి కౌన్సిలర్లు చెబుతున్నమాట ఇలా ఉంది.. ఈ వ్యవహారం అప్పటికప్పుడు జరిగింది కాదని ముందు నుంచి ఇద్దరి మద్య అంతర్గతంగా విభేధాలున్నాయని, ఇప్పుడు బయట పడిందంటున్నారు.
ఇంతకీ కొట్టుకునే వరకు దారితీసిందేంటి..?
పిఠాపురం మున్సిపాలిటీలో కమిషనర్‌గా కనకారావు, డీఈఈ భవానీ శంకర్‌ల మద్య కోల్డ్ వార్ జరుగుతుందన్న విషయం దాదాపు అందరికి తెలిసిన విషయమేనట.. అయితే సమావేశం వేదికగా ఇద్దరూ బాహాబాహికు దిగడం ఇప్పుడు బహిర్గతం అయ్యింది.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపుల విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెబుతూ డీఈఈ భవానీ శంకర్‌పై ఆరోపణలు చేయడంతో గొడవ మొదలవ్వగా దీనిపై స్పందించిన డీఈఈ కమిషనర్‌పై ప్రత్యారోపణలు చేయడంతో రచ్చకెక్కింది.. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఇద్దరూ పరస్పర దాడికి దిగారు..
అధికారులతీరు దొందూ దొందే...
కమిషనర్ ఎన్నికలకు ముందు బాద్యతలు స్వీకరించారు.. డీఈఈ రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.. ఇద్దరి మధ్య బిల్లుల చెల్లింపుల్లోనూ, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలుండగా కమిషనర్ మాట తీరు దురుసుగా ఉండడం, డీఈఈ భవానీశంకర్ రెండేళ్లుగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఇలా ఒకరిపై ఒకరు గతంలోనూ పరస్పర ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఉంది.. అయితే ఒకరంటే ఒకరికి పొసగకపోగా ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా బాగా మాటల యుద్ధం అయితే జరుగుతోందని, కానీ ఒకరిపై ఒకరు చేయిచేసుకునేంత స్థాయిలో విభేధాలున్నాయని మాత్రం అనుకోలేదని కౌన్సిలర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
అధికారుల తీరుతో మరోసారి వార్తల్లోకి..
పిఠాపురంలో ఏ కార్యక్రమం జరుగుతున్న దానికి పెద్ద ఎత్తులో ఫాలోయింగ్ ఈ మధ్యకాలంలో షరా మామూలైపోయింది.. దీనికి కారణం పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయడం, ఆయన భారీ మెజార్టీతో గెలుపొందడం, ఆపై డిప్యూటీ సీఎం, మంత్రి అవ్వడంతో పిఠాపురం పేరు మార్మోగిపోతోంది... నిన్ననే శ్రావణ శుక్రవారం కావడంతో నియోజకవర్గంలోని మహిళలకు 12000 చీరలు పవన్ కల్యాణ్ సొంత ఖర్చుతో పంపిణీచేశారు... మరోపక్క సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పిఠాపురంలోనూ భారీ ఎత్తున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని జనసేన నాయకులు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.