Chandrababu Naidu on Jagan: జగన్ లాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అని.. కానీ జగన్ అనే భూతం ఇంకా ఈ రాష్ట్రాన్ని పట్టుకుని వేలాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఆ భూతాన్ని ప్రజలు శాశ్వతంగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్ళలో గ్రామాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని.. సర్పంచులని వేధించారని అన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ముఖ్యం అని అన్నారు. చివరకు గత 5 ఏళ్ళలో, స్థానిక సంస్థల ఎన్నికలని అపహాస్యం చేశారని అన్నారు. ఐదేళ్లపాటు జగన్ పరదాల పాలన చేశారంటూ విమర్శించారు. జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే స్కూళ్లు మూసేసేవారని, చెట్లు నరికి వేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన 'గ్రామసభ'లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఇలా కూర్చుని గ్రామ సభలు పెట్టుకోవటం గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా చూసామా? ఒక ముఖ్యమంత్రి ఇలా మీ ముందుకు వచ్చి మీతో కలిసిన సందర్భం ఉందా? నాడు ఆయన వస్తున్నాడు అంటే, చెట్లు కొట్టేసేవారు. పరదాలు కట్టేవారు.
స్కూల్స్‌కి సెలవు ఇచ్చే వాళ్ళు. వ్యాపారాలు మూయించే వాళ్ళు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. మీకు స్వేచ్ఛ ఉంది. జగన్ లాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. గత ఎన్నికల్లో ప్రజలు 93% సీట్లు గెలిపించి, కూటమికి తీర్పుగా ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రాన్ని జగన్ అనే భూతం ఇంకా పట్టుకుని వేలాడుతోంది. ఆ భూతాన్ని ప్రజలు శాశ్వతంగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు.
నాడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో పంచాయతీ నిధులు అన్నీ దారి మళ్ళించారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 990 కోట్లు విడుదల చేశాం. మరికొద్ది రోజుల్లోనే మరో రూ.1100 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. నరేగా నుంచి కూడా ఎక్కువ నిధులు గ్రామాలకు వస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలో, 2014-19లో నాటి టీడీపీ ప్రభుత్వానికి, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది.
సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, చెత్త నుంచి సంపదనిచ్చే కేంద్రాలు కానీ, అన్నీ నాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపిస్తే, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గ్రామాలని నాశనం చేసింది’’ అని చంద్రబాబు మాట్లాడారు.