Chandrababu Diet Plan: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మితాహారి. కానీ ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులతో పాటు పలు సందర్భాల్లో స్వయంగా ఆయనే మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ వయస్సులోనూ ఇంత యాక్టివ్ గా ఎలా ఉన్నారని, పాదయాత్రలు, పర్యటనలైనా ఎలా చేయగలుగుతున్నారని, మీ ఆరోగ్య రహస్యం ఏమిటని పలు సందర్భాల్లో చంద్రబాబుకు ఎదురైన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ డైట్ ప్లాన్ గురించి చెప్పారు.
తాను బతకడానికి మాత్రమే ఆహారం తీసుకుంటానని, తినడం కోసం బతకనని కూడా అన్నారు. రోజూ ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం.. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నాం అనేది ఎప్పుడూ లెక్క వేసుకుంటారు. అది మాత్రమే తింటా, ఇది అస్సలే తినను అనే కట్టుబాట్లు ఏవీ లేకుండా.. ఏది ఆరోగ్యానికి మంచిదైతే, ఏ కాలంలో ఏది అందుబాటులో ఉంటే వాటిని తీసుకుంటారు. ఏది తీసుకున్నా మితంగా మాత్రమే తింటారు.
పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పిన డైట్ ప్లాన్ ఏంటంటే..
- ఉదయం: ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఓట్ ఉప్మా, 2 దోశలు, కొద్దిగా చట్నీ, 2 ఎగ్ వైట్‌లు
అల్పాహారానికి భోజనానికి మధ్య ఒక చిన్న పండు - మధ్యాహ్నం: రాగి, జొన్న, సజ్జ, 2 లేదా 3 వెజిటెబుల్ కూరలు, కొద్దిగా పెరుగు
లంచ్ కు ఈవినింగ్ స్నాక్స్‌కు మధ్య కొన్ని డ్రై ఫ్రూట్స్ - సాయంత్రం: సూప్, స్నాక్స్, ఎగ్ వైట్
- రాత్రి: గ్లాసు పాలు మాత్రమే, మరీ ఆకలి వేస్తే ఒక చిన్న పండు
- రోజూ 6 గంటలపాటు నిద్ర
తీసుకునే ఆహారంతో వచ్చే కేలరీలు, చేసే వ్యాయామంతో కరిగిపోయే కేలరీలు.. శరీరానికి అవసరమయ్యేవి ఎన్నో రోజూ లెక్క వేసుకుని అందుకు అనుగుణంగా వ్యాయామంలో మార్పులు చేసుకుంటారు.
చంద్రబాబుకు ఇంటి ఆహారానికి కోర్టు అనుమతి
ఇవీ ఆయన ఆహార నియమాలు.. మెడిసిన్స్ విషయానికొస్తే.. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడు మధ్యలో మందులు వేసుకుంటుంటారు. ఆ మందుల్ని కూడా ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇంటినుంచి వచ్చే ఆహరాన్ని అనుమతించాలని చెప్పింది.
చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు కూడా యాత్రల్లో ఎప్పుడూ ఆయన వెంట ఉంటారు. ఆహార నియమాలు, వేళకు కచ్చితంగా మందులు తీసుకోవడంతో ఆయన ఈ వయసులో కూడా యాక్టివ్ గా ఉంటారని అంటారు. అందుకే అలుపెరగకుండా వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. ప్రజల్ని కలుస్తుంటారు. సమకాలీన రాజకీయాల్లో ఆ వయసులో అంత యాక్టివ్ గా ఉండే నేతల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారనడం అతిశయోక్తి కాదు. అధికారంలేనప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. తిరిగి అధికారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ 2024 ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.
హౌస్ రిమాండ్ కు అనుమతించాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో పూర్తిభద్రత ఉంటుందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలతో జడ్జి ఏకీభవించారు. సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది.