Chandrababu Family Members Reached Rajamundry Jail: 


రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కలవబోతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ములాఖత్ కి ఏర్పాట్లు జరిగాయి. ఈ ములాఖత్ కోసం ఇప్పటికే కుటుంస సభ్యులంతా రాజమండ్రి చేరుకున్నారు. నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా రాజమండ్రికి వచ్చారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కూడా రాజమండ్రికి వచ్చారు. 


 



ప్రస్తుతం నారా లోకేష్ యువగళానికి కాస్త విరామం ఇచ్చారు. దీంతో ఆయన యువగళం కారవాన్ ను రాజమండ్రిలోనే ఉంచారు. రాజమండ్రి వచ్చిన కుటుంబ సభ్యులు కారవాన్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ తర్వాత నేరుగా వారు రాజమండ్రి జైలుకి వెళ్లి చంద్రబాబుని కలిసే అవకాశముంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబుని ఈరోజు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు చంద్రబాబుకి రోజూ రాజమండ్రిలోని టీడీపీ నేతల ఇంటి నుంచే ఆహారాన్ని పంపిస్తున్నారు. ఆయన మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి అల్పాహారం, మందులు పంపిస్తున్నారు. 


సత్యమే గెలుస్తుంది..
రాజమండ్రిలో ఉన్న నారా లోకేష్, పార్టీ నాయకులతో నిరంతరం సమాలోచనలు జరుపుతున్నారు. సత్యమే గెలుస్తుందని, అధైర్య పడవద్దని ఆయన అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. శాంతి యుత నిరసనలపై హత్యాయత్నం కేసులు పెట్టడం, సీఎం జగన్ లో ఉన్న భయానికి నిదర్శనం అన్నారు లోకేష్. 


చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని చెప్పారు లోకేష్. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పరిణామాలు చూసి తట్టుకోలేక ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని...అంతిమంగా సత్యమే గెలుస్తుందని అన్నారాయన. టీడీపీ అధినేత అరెస్టు, జగన్ చేపట్టిన కక్ష పూరిత చర్య అని ఇప్పటికే దేశమంతా గుర్తించిందని...అరెస్టుపై న్యాయం పోరాటం చేస్తున్నామని లోకేష్ చెప్పారు. అధారాలు లేని కేసుతో వైసీపీ ఆడుతున్న డ్రామాకు త్వరలో తెరపడుతుందన్నారు. ప్రజలెవరూ భావోద్వేగాలకు గురికావద్దని, అంతా క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు లోకేష్. 


నిరాహారదీక్ష చేస్తే కేసులా?
రాష్ట్రంలో అక్రమ కేసుల విషయంలో జగన్ ప్రభుత్వ పైత్యం పెరుగుతోందని మండిపడ్డారు లోకేష్. అధినేత అరెస్టుపై శాంతి యుత నిరసనలు చేసిన వారిపై కూడా హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జగన్ ఫ్రస్టేషన్ కు, భయానికి నిదర్శనం అన్నారు. శ్రీకాళహస్తిలో నిన్న సామూహిక నిరాహార దీక్షకు దిగిన 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్ కు పంపించడంపై లోకేష్ మండి పడ్డారు. నిరాహార దీక్షలకు, దిష్టబొమ్మ దహనాలకు కేసులుపెట్టి రిమాండ్ కు పంపే పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో ఉన్న ఆవేదన, ఆగ్రహం బయటకు కనపడకుండా చేయడానికే ఈ అక్రమ కేసుల కుట్రలు అని లోకేష్ మండి పడ్డారు. పసుపు జెండా చూసినా, పసుపు దళం గళం విన్నా జగన్ వెన్నులో వణుకు పుడుతుందన్నారు లోకేష్. నియంత నిర్ణయాలతో టీడీపీని కట్టడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.