Konaseema News:  పేద‌, మ‌ద్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారిలో చాలామందిలో త‌మ పిల్ల‌లు కేంద్రీయ విద్యాల‌యంలో చ‌దివించాల‌ని ఉంటుంది. ఎందుకంటే అక్క‌డ సీబీఎస్ఈ కరికుల‌మ్ ఉంటుంది కాబ‌ట్టి. ప్రాథమిక విద్య‌లో కేంద్రీయ విద్యాల‌యానికి ఉన్న విలువ అటువంటిది. అయితే కేంద్రీయ విద్యాల‌యాలు చాలా ప‌రిమితంగా ఉండ‌డంతో చాలా మంది త‌ల్లిదండ్రులు సీబీఎస్ఈ సిల‌బ‌స్‌పై ఉన్న మ‌క్కువ‌తో త‌మ శ‌క్తికి మించి ఈ సిల‌బ‌స్ ఆఫ‌ర్ చేస్తోన్న ప్ర‌యివేటు విద్యాసంస్థ‌లను ఆశ్ర‌యించే ప‌రిస్థితి ఉంటుంది. అయితే ఇలా ఆకాంక్షించే వారి కో గుడ్‌న్యూస్ ఇది.

కేంద్రీయ విద్యాల‌యం ఇప్ప‌డు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయ్యింది. అల్ల‌వ‌రం మండ‌లం ఓడ‌ల‌రేవు స‌ముద్ర‌తీర ప్రాంతంలో 7.50 ఎక‌రాల భూమిలో కేంద్రీయ విద్యాల‌య నిర్మాణానికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేయ‌గా భ‌వ‌న‌, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం 7.50 ఎక‌రాల భూమిని ప‌రిశీల‌న చేశారు అధికారులు. అయితే ఇప్ప‌డు తాజాగా భూ సేక‌ర‌ణ నిమిత్తం రూ.330 కోట్లు ప్ర‌భుత్వం మంజూరు చేయ‌డంపై కోన‌సీమ వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో రెండోది..ఇంత‌వ‌ర‌కు ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజ‌మండ్రిలో కేంద్రీయ విద్యాల‌య ఉండ‌గా అది ఓఎన్జీసీ స‌హ‌కారంతో కొన‌సాగుతోంది. అయితే ఇప్ప‌డు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో మ‌రొక‌టి మంజూరు కాగా ఇది రెండో కేంద్రీయ విద్యాల‌యం. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా అల్ల‌వ‌రం మండ‌లం ఓడ‌ల‌రేవు సాగ‌ర తీరం స‌మీపంలో ఈ కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అమ‌లాపురం ఎంపీ గంటి హ‌రీష్ మాధూర్ చొర‌వ‌తో భూ సేక‌ర‌ణ నిమిత్తం నిధులు మంజూరు కాగా దీనికి కృషిచేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఎంపీ హ‌రీష్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

పేద మ‌ద్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు హ‌ర్షం...డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలోని వడలరేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి మార్గం సుగమం అవ్వ‌డంతో ముఖ్యంగా ఈ ప్రాంత విద్యావేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా కోనసీమ వాసులు ఎదురుచూస్తోండ‌గా ఈప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయ, మత్స్యకార కుటుంబాలు, కార్మిక కుటుంబాల్లోని పిల్లలతోపాటు ఇతర ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు స్థానికంగా ఉన్నతమైన సీబీఎస్ఈ విద్యను అందించే అవ‌కాశం క‌లగ‌డంపై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సీబీఎస్ఈ కోర్స‌ను త‌మ పిల్ల‌ల్ని చ‌దివించేందుకు నిరుపేద‌లు, మ‌ద్య‌త‌ర‌గ‌తి వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.  పిల్లల భవిష్యత్తు కోసం ఓడలరేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయాన్ని త్వరితగతిన ప్రారంభించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు.