Andhra Pradesh has securing 10 awards under OPOD |  న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన 29 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 10 దక్కాయి. ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ అవార్డుల్లో ఏపీ సత్తా చాటింది. న్యూఢిల్లీలోని భారత మండపంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ చేతులమీదుగా ఏపీ బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవితతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. 

అవార్డులలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)

కేంద్ర వాణిజ్యశాఖ దేశవ్యాప్తంగా ఎ, బి క్యాటగిరీల్లో మొత్తం 29 అవార్డులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏకంగా పది అవార్డులు కొల్లగొట్టింది. రాష్ట్రాలకు ఎ-క్యాటగిరీలో ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణం సాధించింది. వ్యవసాయేతర ఉత్పత్తుల్లో జిల్లాలకు ప్రకటించిన అవార్డుల్లో గుంటూరు జిల్లా (మిర్చి), బాపట్ల జిల్లా (చీరాల పట్టు చీరలు-కుప్పాడం), తిరుపతి జిల్లా (వెంకటగిరి కాటన్‌ చీరలు), విజయనగరం జిల్లా (బొబ్బిలి వీణ) బంగారు పతకాలు కొల్లగొట్టగా, శ్రీకాకుళం జిల్లా (జీడిపప్పు) కాంస్యం సాధించింది. వ్యవసాయేతర ఉత్పత్తుల విభాగంలోనే శ్రీసత్యసాయి జిల్లా (ధర్మవరం పట్టుచీరలు)కు రజతం వచ్చింది. కాకినాడ జిల్లా (పెద్దాపురం సిల్క్స్‌), అనకాపల్లి జిల్లా (ఏటికొప్పాక బొమ్మలు) కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా (నరసాపురం లేస్‌ అల్లికలు) స్పెషల్ ప్రైజ్ సొంతం చేసుకొంది. 

సీఎం చంద్రబు నాయకత్వమే కారణమన్న మంత్రి సవిత

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి సవిత మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం, సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నేడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది. వ్యవసాయంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలు, చేనేతకు పూర్వవైభవం తీసుకువస్తున్నాం. చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం ప్రతి నెలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంది. అందుకు అవసరమైన మార్కెట్‌ లింకేజి సౌకర్యం సైతం కల్పించి వారిని ప్రోత్సహిస్తున్నాం. చంద్రబాబు విజన్, ఆయన ఆలోచనలకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇవ్వడంతోనే ఈ అవార్డులు సాధ్యమయ్యాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా, ఏపీ చేనేతశాఖ కమిషనర్‌ రేఖారాణి, ఇతర అధికారులు, అవార్డులు వచ్చిన రాష్ట్రానికి చెందిన ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.