Bro Anil Kumar Comments in Konaseema: వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అంతర్జాతీయ సువార్తీకుడు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో నిన్న నిర్వహించిన పాస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అంతకంతకూ అప్పుల పాలవుతోందని, రేపు పుట్టబోయే బిడ్డలపైనా అప్పులు భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. శత్రువులందరూ నశించిపోవాలని పేర్కొన్న ఆయన..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అనిల్ పేర్కొన్నారు.