ఏర్పాట్లు పర్యవేక్షించిన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు ఆపార్టీ పిఠాపురం వేదికగా భారీ ఏర్పాట్లు చేస్తోంది.. ఈక్రమంలోనే 14వ తేదిన పిఠాపురంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ భారీ సభకు సంబంధించి భూమి పూజ శనివారం మూడు గంటలకు చేస్తున్నారు.. ఈ ఏర్పాట్లపై జనసేన పీఏసీ ఛైర్మన్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. కాకినాడ జిల్లాలోని చిత్రాడ-కాకినాడ రోడ్డులో ఉన్న ఎస్బీ వెంచర్ స్థలం వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
భారీ సభకోసం భారీ ఏర్పాట్లు..
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి ప్లీనరీ కావడంతో ఆవిర్భావ సభను భారీ ఎత్తులో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు దిశగా జనసేన పార్టీ ప్రయత్నాలు షురూ చేసింది.. ఇందుకోసం చిత్రాడ వద్ద సుమారు 200 ఎకరాలకు పైబడిన ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసి భూమి చదును పనులు చేపట్టారు. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, జనసేన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు ఎంపీలు సభకు హాజరవుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చే మహిళలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు పార్టీ ముఖ్యనేతలు, వీఐపీలు నేరుగా సభా స్థలికి వెళ్లేలా ఏర్పాట్లను చేస్తున్నారు.
సూచనలు.. సలహాలు ఇచ్చిన మనోహర్..
ఈ నెల 14న జరగనున్న భారీ బహిరంగ సభ విషయంలో ఏర్పాట్లన్నీ పక్కాగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి మనోహర్ సూచించారు. ఆయన సభా ప్రాంగణాన్ని పరిశీలించిన క్రమంలోనే పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.. ప్లీనరీకు తరలి వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు..
ఒక్కరోజుకు కుదించడంతో ఇబ్బందులు..?
మొదట మూడు రోజుల పాటు ప్లీనరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సభకు హాజరయ్యే వారి తాకిడి కొంత తగ్గే అవకాశం ఉంటుందనుకున్నారు.. అయితే ఈ సభను ఒక్కరోజుకే కుదిస్తూ పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఒకే రోజు భారీ సభ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభ నిర్వాహణ కమిటీలు, పార్టీ పార్లమెంటరీ సమన్వయ కర్తలను నియమించారు. తాజాగా సభావేదికకు సంబంధించి ఏర్పాట్లు ఏలా జరుగుతున్నాయనే దానిపై నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.