Andhra Pradesh News | ఏపీలో ఖాళీ అవుతోన్న ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక కాబోయే 5 ఎమ్మెల్సీ సీట్లుకు సంబంధించి పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవుల కేటాయింపుల్లో ఎవ్వరికి ఇస్తారు అనే చర్చ జోరందుకుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లు పలువురు ఆశావాహులు ఎదురు చూస్తుండగా అధినేత ద్వారా హామీ పొందిన వారు అయితే ఈ సారి తప్పకుండా తమకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఈమార్చి నాటికి పదవీకాలం పూర్తి అవుతోన్న వారు కూడా రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశించడంతో అసలు సమస్య మొదలైంది.  


వర్మకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా...


పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ టీడీపీ సీటు పక్కా వస్తుందని అంతా భావించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం సీటు కోరుకోవడంతో ఆయనకు కేటాయించాల్సిన పరిస్థితి తప్పనిసరి అయ్యింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇంతవరకు అది నెరవేరలేదు. ఇటీవల అవకాశం వచ్చినా అది జనసేన పార్టీ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్‌ కు దక్కింది.. అయితే తాజాగా శాసన సభ్యుల ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ కానుండటంతో ఈ సారి వర్మకు పక్కా అన్న చర్చ జోరుగా సాగుతోంది.. 


ఆశావహుల జాబితాలో యనమల ఉన్నారా..?


టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి కాలం మార్చి 29తో ముగుస్తోంది. అయితే మార్చి 20న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నేతగా ఉన్న యనమలకు దక్కే ఛాన్స్‌ ఉంటుందా అన్నదానిపైనా చర్చ సాగుతోంది. మొన్నటి క్యాబినేట్‌ విస్తరణలో యనమలకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కుతుందన్న చర్చ జోరుగా సాగింది. అయితే అది లెక్క తప్పగా జూనియర్‌ కోటాలో ఏదైనా పదవి యనమల కుమార్తెకు అయినా దక్కుతుందని అంతా ఊహించారు. కానీ అదీ జరగలేదు. కమ్మ సామాజిక వర్గన్ని టార్గెట్‌ చేస్తూ కాకినాడ ఎకనామిక్‌ జోన్‌, సీపోర్ట్‌ల విషయంలోలేఖ సంధించడం, యువనేత లోకేష్‌తో పొసగడం లేదన్న వార్తలు మొత్తం మీద యనమలకు పదవి దక్కే ఛాన్సులు తక్కువని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని యనమల ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎమ్మెల్సీ కోటాలో యనమలకు పదవి దక్కుతుందా అన్న చర్చ ఉమ్మడి తూర్పులో జోరుగా సాగుతుండగా కాకినాడ జిల్లా పరిధిలోనే ఇద్దరికి అవకాశం ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు...


నాగబాబుకు కూడా పక్కా కన్ఫర్మ్‌..


డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, జనసేన పార్టీ నేత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో జనసేనకు ఇప్పటికే మూడు మంత్రి పదవులు కేటాయించగా నాలుగో  మంత్రి పదవిగా నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉండడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి పక్కా అని చర్చ జరుగుతోంది..


Also Read: Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్