Atreyapuram Putharekulu: స్వీట్లలో ఆత్రేయపురం పూతరేకులకున్న పేరు అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే మిఠాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పూతరేకులంటే చాలా మందికి మక్కువ. దేశ విదేశాలకు కూగా ఎగుమతి అవుతోన్న ఆత్రేయపురం పూతరేకుల బ్రాండ్‌కు భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. అంతటి పేరున్న ఈ పూతరేకుల్లో కల్తీ రేకులు కూడా చేరుతున్నాయి.  


పూతరేకుల్లో కల్తీ అనేది కేవలం ఆరోపణలే కాదు. అధికారులు తనిఖీలు చేసి సేకరించిన శాంపిల్స్‌లో కీలకాంశాలు వెలుగు చూశాయి. వీటి తయారీలో వాడిన పదార్థాల్లో కల్తీ అవశేషాలు ఉన్నట్లు పరీక్షల్లో బహిర్గతమైంది. దీంతో ఆత్రేయపురం పూతరేకులంటే ఇష్టపడే స్వీట్‌ ప్రియులు పూతరేకులు తినాలంటే ముందు వెనుక ఆలోచించే పరిస్థితి వచ్చింది. జరిగిన నష్టాన్ని గ్రహించిన ఆత్రేయపురం పూతరేకుల తయారీ అసోసియేషన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్దలు ఇటువంటి అపకీర్తికి కారణమైన వారిని అసోసియేషన్‌ నుంచి తొలగిస్తామని హెచ్చిరించింది. 


అసలేం జరిగింది?
ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ పదార్ధాలు వాడుతున్నారనే ఆరోపణలతో ఫుడ్‌ సేప్టీ అధికారులు ఫిబ్రవరి 17న నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ముడిసరకు అమ్మే దుకాణాల్లో, పాలకోవా తయారీ కేంద్రాల్లో లోకల్‌గా తయారు చేసిన నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పూతరేకుల దుకాణాల వద్ద తనిఖీలు చేసి నమూనాలను సేకరించారు. 


ఇలా సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తేనే కల్తీనా కాదా అనేది నిర్ధారించగలమని అధికారి శ్రీనివాస్‌ అప్పట్లో చెప్పారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఇప్పుడు ఆ రిపోర్టులు వచ్చాయి. 


నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తింపు..


ఆత్రేయపురంలో సేకరించిన శాంపిల్స్‌లో మూడింటి నమూనాల్లో కల్తీ జరిగినట్లు గుర్తించినట్లు ఆహార భద్రతా అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. ఆత్రేయ డ్రైఫ్రూట్స్‌ అండ్‌ నెయ్యి విక్రయదారుడు, శివపార్వతి పాలకోవా, పూతరేకుల తయారీదారులు, షణ్ముక డిస్పోజల్‌ ముడిసరకు అమ్మకందారుడి నుంచి సేకరించిన శాంపిల్స్‌లో కల్తీ జరిగినట్లు తేలింది. దీనిపై సంబందిత యజమానులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. 


కల్తీనెయ్యితోనే పూతరేకుల తయారీ..
ఆత్రేయపురంలో తయారయ్యే పూతరేకుల్లో పలు దుకాణాల్లో కల్తీనెయ్యి వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు తయారీ దారులను గట్టిగానే హెచ్చరించారు. బ్రాండ్‌ ఉన్న నెయ్యిలనే వినియోగించాలని సూచించారు. దీంతో ముడిసరకులు అమ్మే దుకాణదారుల నుంచి ఇకపై నెయ్యి, ఇతర ముడిసరకులు కొనుగోళ్లు ఆపివేయాలని వారంతా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్రేయపురం పూతరేకుల బ్రాండ్‌ను దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యి, ఇతర ముడిసరకులను విక్రయించిన వారిని శాశ్వతంగా బహిష్కరిస్తామని, పూతరేకుల తయారీదారులు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని వీరి అసోసియేషన్‌ సూచించింది..