Andhra Pradesh Latest Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో సూరీడు సుర్రుమంటున్నాటు. తగ్గేదేలే అన్నట్టు రోజురోజుకు తీవ్ర పెంచేస్తున్నాడు. మార్చి నెలలోనే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు, విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు చేస్తోంది. 


మారిన వాతావరణంతో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో మాత్రం ఉష్ణోగ్రతులు పెరుగుతాయని చెబుతోంది. ఉష్ణోగ్రతకు తోడు వివిధ ప్రాంతాల్లో వీచే వడగాలులు మరింత సెగలు పుట్టిస్తాయని విపత్తు నిర్వహాణ అధికారులు చెప్పారు.  




గురువారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 59 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది విపత్తు నిర్వహణ శాఖ. శుక్రవారం 33 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల పాటు వాతావరణంలో పెద్దగా మార్పులు లేకపోయినా సెగలు మాత్రం తప్పవని చెబుతున్నారు.  


నేడు వడగాలులు వీచే మండలాలు జిల్లాల వారిగా చూస్తే... శ్రీకాకుళం జిల్లా-15, విజయనగరం-20, పార్వతీపురం మన్యం-14, అల్లూరి సీతారామరాజు-2, కాకినాడ-3, తూర్పుగోదావరి-5 ఉన్నాయి. బుధవారం నమోదు అయిన ఉష్ణోగ్రత వివరాలు గమనిస్తే... అత్యధిక ఉష్ణోగ్రతలు నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా  అట్లూరు, ఖాజీపేటలో 41.2 డిగ్రీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7 డిగ్రీలు, కర్నూలులో 40.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 40.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.  


అందుకే అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రావాల్సి వస్తే అందుకు తగ్గట్టుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. ఇంట్లో ఉన్న ముసలివాళ్లు, చిన్న పిల్లలు, హృద్రోగులు, గర్భిణిలు మరింత అప్రమత్తంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. నీళ్లు ఎక్కువ తాగాలని హెచ్చరిస్తున్నారు. లేకుంటే డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.