APSRTC Special Buses : దసరా, దీపావళి మొదలు ఇకపై అన్నీ పండగ రోజలే. పండగలు వచ్చాయంటే ఎక్కడ ఉన్నా సరే ఇంటికి వెళ్లిపోవాలనే ఆలోచనలో తూర్పుగోదావరిజిల్లా ప్రజలు ఉంటారు. అక్కడ ఆతిథ్యం, ఇతర అహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు మిగతా ప్రాంత ప్రజలు వెళ్తుంటారు. దీంతో పండగ సీజన్ వచ్చిందంటే చాలు తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. 


ఇలాంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా తూర్పుగోదావరి డిపో నుంచి ప్రత్యేక బస్‌లు నడుపుతోంది. హైదరాబాగ్, వైజాగ్, విజయవాడ ఇలా అన్ని ప్రముఖ నగరాలకు బస్‌లు తిప్పుతోంది. తుని, ఏలేశ్వరం, కాకినాడ ఆర్టీసీ డిపోల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు నిత్యం బస్‌లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ బస్‌లు ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది ఆర్టీసీ. 42 బస్‌లు హైదరాబాద్‌, 20 విజయవాడకు, మరో 20 విశాఖకు వేస్తున్నారు. బెంగళూరుకు ఒక ప్రత్యేక బస్సు వేశారు. 


ఇప్పుడు వేసిన స్పెషల్ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ 23 ఉంటే అల్ట్రా డీలక్స్‌ 14 ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 4 తిప్పుతున్నారు. కాకినాడ నుంచి 18, తుని నుంచి 11, ఏలేశ్వరం నుంచి 13 బస్‌లు హైదరాబాద్‌కు వెళ్లనున్నాయి. ఇవే కాకుండా రద్దీని బట్టి అప్పటికప్పుడు కూడా సర్వీస్‌లు మార్పులు చేర్పులు చేస్తుంటామని అంటున్నారు  అధికారులు. 


ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉండే ఈ బస్‌ల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమన్నారు ఆర్టీసీ అధికారులు. ప్రత్యేక బస్‌ల్లో ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడం లేదని చెప్పారు. అన్ని బస్సుల్లో ఇప్పటి వరకు తీసుకుంటున్నట్టుగానే ఛార్చీలు వసూలు ఉంటుందని అంటున్నారు. రెండు వైపుల టికెట్‌ను ఆన్‌లైన్‌లో ఒకేసారి తీసుకుంటే పది శాతం రాయితీ కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 


Also Read: పది పాసైతే చాలు, టాప్‌-500 కంపెనీల్లో ఛాన్స్‌ - మీ కలను నిజం చేసే 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్'