AP Police filed case on Actress Sri Reddy | రాజమండ్రి: సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై వరుస కేసుల నమోదు, అరెస్ట్‌లతో దూకుడు ప్రదర్శిస్తున్నారు ఏపీ పోలీసులు. గతంలో వైసీపీ తరపున సోషల్ మీడియాలో చెలరేగి పోస్టులు పెట్టినట్లు సినీ నటి శ్రీరెడ్డిపై కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి బూతు పురాణంపై తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసులకు ఫిర్యాదు అందింది.
టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటి శ్రీరెడ్డిపై బమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 బీఎస్‌ఎన్, 67 ఐటీఏ 2000`2008 సెక్షన్లు కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్టులపై పలువురు ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, అందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం మద్దతే కారణమని పద్మ ఆరోపించారు. శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కూటమి నేతలే లక్ష్యంగా వీడియోలు..
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా పోస్టులు పెట్టారు. కూటమి నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి పలు వీడియోలు చేయగా ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితలతోపాటు మరికొందరు బీజేపీ నేతలే టార్గెట్ గా అసభ్య పదజాలంతో చెలరేగి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఉచ్చరించేందుకు కూడా సిగ్గుపడే భాషలో మాట్లాడిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
కర్నూల్‌లోనూ కేసు నమోదు..
సినీ నటి కొందరిని టార్గెట్‌గా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని గతంలో కర్నూల్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఏడాది జూలై 20న కేసు నమోదయ్యింది. కూటమి ముఖ్యనేతలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ బీసీ సెల్ నాయకుడు నాగరాజు ఫిర్యాదు చేశారు. తాజాగా రాజమహేంద్రవరం బమ్మూరులో టీడీపీ మహిళా నేత మజ్జి శ్రీరెడ్డి ఆమె సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యల క్లిప్పింగ్‌లతో సహా ఫిర్యాదు చేయగా శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్షమించాలంటూ ఓ వీడియో...
సోషల్ మీడియా వేదికగా నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిష్టులపై ఏపీ పోలీసులు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. చర్యలలో భాగంగా ఒక్కక్కరిని అరెస్ట్ చేస్తుండడంతో శ్రీరెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వంగలపూడి అనితలను క్షమాపణ కోరుతున్న శ్రీరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.