Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన సోషల్ యాక్టివిస్టులను అరెస్టు చేస్తున్నారంటూ వైసీపీ విమర్సలు చేస్తోంది. ఈ వివాదంలో మూకుమ్మడిగా అరెస్టులు చేస్తున్నారని విజయబాబు అనే పిటిషన్ పిల్ వేశారు. పిల్‌ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి విషయాల్లో అభ్యంతరాలు ఉంటే కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది.
ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిన హైకోర్టు
ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం గుర్తు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పోలీసులు కట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టానికి అనుగుణంగా కేసులు పెడుతుంటే తాము ఎలా నిలువరిస్తామని కామెంట్ చేసింది.
మరోవైపు ఈ కేసులో విచారణ వేగవంతం చేస్తున్న పోలీసులు ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న వర్రా రవీందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్కు తరలించారు. ఆయనతోపా మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈయనతో టచ్‌లో ఉంటూ అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన అవినాష్ పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కదలికలపై నిఘా పెట్టారు.
ఈ కేసులో వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రాఘవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రశ్నించేందుకు నోటీసు ఇవ్వబోయారు. ఆయన పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. పులివెందుల, లింగాల మండలాల్లో జల్లెడ పడుతున్నారు. రాఘవరెడ్డి సొంతూరు అయిన అంబకపల్లెలో ప్రత్యేక నిఘా ఉంచారు.
భార్గవ్‌పై లుకౌట్ నోటీసులు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంద. ఆయనపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు పలు క్రిమినల్ నమోదు అయ్యాయి. అంతే కాకుండా వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో సజ్జల భార్గవ్ పేరు వచ్చిందని అంటున్నారు. అందుకే ఆయన్ని పిలిచి ప్రశ్నించాలని చూస్తున్నారు. ఇంత వరకు ఆయన ఆచూకీ మాత్రం లభించడం లేదు. అందుకే ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
కేసులపై జాతీయ మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
కేసులపై ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే జాతీయ ఫోరమ్‌లలో వైసీపీ ఫిర్యాదు చేస్తోంది. గత వారం రోజుల్లోనే 147 అక్రమ కేసులు పెట్టారని 680 మందికి నోటీసులు జారీ చేసి 49 మందిని అరెస్టు చేసినట్టు వైసీపీ చెబుతోంది. ఈ మేరకు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాుదు చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారని వాపోయింది. అక్రమ కేసుల అంశాన్ని ఏపీ డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొంది. రెండు రోజులు ఎదురు చూసిన ఎలాంటి స్పందన లేదని వివరించింది. ఈ అరాచకాలపై విచారణ చేసి చర్యలు చేపట్టాలని కోరింది.
Also Read: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?