AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..

ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్ర‌పురంలో ఆయ‌న తండ్రి స‌త్యం పెత్త‌నం మితిమీరుతోందా.. ఆయ‌న వ‌ల్ల టీడీపీ క్యాడ‌ర్ దూర‌మ‌వుతోందా.. ఇప్ప‌డు ఇదే చ‌ర్చ‌సాగుతోంది..

Continues below advertisement

రామచంద్రాపురం: పార్టీలో చేరిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకుని, ఎన్నికల్లో గెలిచారు. ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రి పదవిని దక్కించుకున్న అదృష్టవంతునిగా ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పేరు మార్మోగిపోయింది.. అయితే ఎంత తక్కువ వ్యవధిలో ఓ మంత్రి స్థాయి వరకు ఎదిగారో.. అంతే తక్కువ సమయంలో ఆయన పనితీరుపై విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ అంతర్గత మీటింగ్‌లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన ఆడియో బయటకు వచ్చి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Continues below advertisement

ఆ తరువాత అసెంబ్లీకి ఆలస్యంగా వస్తున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా వ్యాఖ్యానించడం.. ఇలా వరుసగా ఎదురైన చేదు అనుభవాలు మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ఒకింత ఇబ్బందికి గురిచేశాయి. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం చర్యల ద్వారా వాసంశెట్టి సుభాష్ ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్నారని.. మరోవైపు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని సైతం పక్కన పెడుతున్నారని క్యాడర్ లో వినిపిస్తోంది.

అన్నీ తానై చక్రం తిప్పుతూ...

రామచంద్రపురంలో ఒకప్పటి టీడీపీ క్యాడర్‌ అంతా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధానంగా మంత్రి సుభాష్ తండ్రి సత్యం చర్యలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో సుభాష్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిని పనిగట్టుకుని పక్కన పెట్టి ఎందులోనూ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది మరో ఆరోపణ. ఇదిలా ఉంటే పార్టీ కార్యకర్తల నుంచి అధికారుల వరకు అంతా మంత్రి సుభాష్‌ తండ్రి సత్యం పేరునే జపం చేయడం.. ప్రతీ అభివృద్ధి పనుల విషయంలోనూ ఆయన పేరు పనిగట్టుకుని చెప్పించుకోవడం ఇక్కడ అసలు ఎమ్మెల్యే సుభాష్‌నా లేక ఆయన తండ్రి సత్యంనా అన్నంతగా సామాన్య ప్రజలు కన్ఫ్యూజ్‌ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇంకా విచిత్రం ఏంటంటే మంత్రి సుభాష్‌ నియోజకవర్గంలో లేకపోయినా అన్నీ తానై మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం కానిచ్చేయడం, దానికి అధికారులు సైతం హాజరు అవ్వడం, ఆపై పబ్లిక్‌ రిలేషన్స్‌శాఖ అధికారులు సైతం ఆయన పేరుమీదే ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయడం కనిపిస్తోందని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు...

వాసంశెట్టి ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా..

మంత్రి సుభాష్‌ తండ్రి వాసంశెట్టి సత్యం ఎలాంటి రాజకీయ పదవిలో లేరు. మంత్రికి తండ్రి కావడంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అదే పేరుతోనే నియోజకవర్గంలో అంతా చక్రం తిప్పుతున్నారని, వాసంశెట్టి సుభాష్ విజయం కోసం పనిచేసిన వారిని సైతం పట్టించుకోవడం లేదని క్యాడర్ అసంతృప్తిగా ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఇటీవల మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కంటే ఆయన తండ్రి సత్యం పేరే ప్రముఖంగా వినిపించింది. స్థానికంగా ఏమైనా ప్రకటనలు వచ్చినా వాసంశెట్టి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పేరుతోనే వెలువడుతున్నాయి. చాలా కార్యక్రమాల్లో మంత్రి సుభాష్‌ కంటే ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం పేరు ఎక్కువగా వినిపిస్తోందని చెబుతున్నారు. అన్నీ తానై తండ్రి నడిపిస్తున్నా.. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏం చేస్తున్నారని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయని తెలుస్తోంది.  

Continues below advertisement